Engineering Seats in Telangana: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్ బ్రాంచీల్లోనే భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోవడంతో కళాశాల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. అన్ని కళాశాలల్లో మెకానికల్, సివిల్, ఈఈఈ బ్రాంచీలు (Engineering Seat Allotment 2021) వెలవెలబోతున్నాయి. కొన్నిచోట్ల 67 సీట్లకు 10 మందిలోపే చేరడంతో వారిని మరో బ్రాంచీలో చేరేలా ప్రోత్సహించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈనెల 29న స్లైడింగ్ విధానం జరగనున్న నేపథ్యంలో వారిని మరో బ్రాంచికి ఆప్షన్లు ఇచ్చేలా చేస్తే కొంతవరకు ఆర్థిక భారం తప్పించుకోవచ్చన్నది ఆలోచన. అది జరిగితే విద్యార్థులకు బోధన రుసుములు రావు. అది కళాశాలలకు అవరోధంగా మారనుంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీ సీట్లు 726
ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు మిగిలితే వాటిని ముందుగా స్లైడింగ్ ద్వారా బ్రాంచీలు మారేలా చేస్తారు. అనంతరం స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఆ రెండు ప్రక్రియల ప్రవేశాలు ఉండవు. మిగిలిన సీట్లను వచ్చే ఏడాది ఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లే 4069. వాటిల్లో 726 భర్తీ కాలేదు. ప్రైవేట్ కళాశాలల్లో 21,467 సీట్లు మిగిలాయి. అయిదారు కళాశాలలు తప్ప మిగిలిన అన్నింట్లో కోర్ బ్రాంచీల్లో సీట్లు భర్తీ కాలేదు. వర్ధమాన్ కళాశాలల్లో మెకానికల్‌లో 47 సీట్లకు 26, సివిల్‌లో 46కి 30 మంది చేరారు. సీవీఆర్‌లో 47 మెకానికల్ సీట్లకు 29 మంది ప్రవేశాలు పొందారు.
కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో...
- జేఎన్‌టీయూ సిరిసిల్లలో టెక్స్‌టైల్ టెక్నాలజీలో 22 సీట్లకు ఆరుగురే చేరారు. మెకానికల్‌లో 67కి 9 మంది, ఈఈఈలో 67కి 37, సివిల్‌లో 67కి 19 మంది ప్రవేశాలు పొందారు.
- జేఎన్‌టీయూ మంథనిలో మైనింగ్‌లో 34 సీట్లలో 25 మంది, మెకానికల్‌లో 67కి 35, సివిల్‌లో 66కి 60, ఈఈఈలో 66కి 62 సీట్లు నిండాయి.
- కాకతీయ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం కళాశాలలో మైనింగ్ ఇంజినీరింగ్(సెల్ఫ్ ఫైనాన్స్)లో 17 సీట్లుంటే ముగ్గురే చేరారు. ఈసీఈలో 66కి 12, ఐటీలో 67కి 17 మంది ప్రవేశాలు పొందారు. రెగ్యులర్ మైనింగ్ కోర్సులో 28 సీట్లుంటే 26 నిండాయి.
- ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్‌లో 67 మైనింగ్ సీట్లకు 50 మంది చేరారు.
కొలువులు ఉంటాయా? ఉండవా?
ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో సీట్లు (Engineering Seat Allotment 2021) పెరగడంతో విద్యార్థులు వాటిలో భారీగా చేరారు. దాంతో మెకానికల్, సివిల్, ఈఈఈ బ్రాంచీల్లో ప్రవేశాలు బాగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఈ విభాగాల్లో పనిచేసే అధ్యాపకులు.. తమ కొలువులు ఉంటాయా? అని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: TS EAMCET counseling 2021: నేడు ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్