రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. 12 జిల్లాల పరిధిలో 3,249 గ్రామపంచాయతీలు, 32,504 వార్డులకు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. రాత్రి 12 గంటల వరకూ అందిన సమాచారం మేరకు.... 3 రోజుల్లో సర్పంచి స్థానాలకు 22,191, వార్డు సభ్యుల స్థానాలకు 77,129 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నిర్ణీత సమయం గడిచే సరికి లైన్లలో నిల్చున్న వారందరికీ టోకెన్లు ఇచ్చారు. దీంతో పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.
కృష్ణా జిల్లాలో విజయవాడ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో తొలివిడతకు సంబంధించి మూడో రోజున సర్పంచి స్థానాలకు 871, వార్డుసభ్యుల స్థానాలకు 5 వేల 531 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద సర్పంచి స్థానాలకు 1,379, వార్డు స్థానాలకు 7,889 నామపత్రాలు దాఖలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో మూడ్రోజులకు గానూ సర్పంచి స్థానాలకు 1,772 మంది, వార్డుసభ్యుల స్థానాలకు 6,382 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
చిత్తూరు జిల్లాలో ఆఖరి రోజు సర్పంచ్ స్థానానికి 1,577, వార్డు సభ్యుల స్థానాలకు 5,119 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద జిల్లాలో సర్పంచి పదవుల కోసం 2,890 మంది, వార్డు సభ్యులుగా 6,821 మంది నామినేషన్లు వేశారు. అనంతపురం జిల్లాలో మూడో రోజు 806 మంది.. సర్పంచ్ స్థానాలకు, 2,376 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారు. మొత్తంగా జిల్లాలో సర్పంచి స్థానాలకు 1,351, వార్డు సభ్యుల స్థానాలకు 3,153 మంది నామపత్రాలు వేశారు.
93 స్థానాల్లో ఏకగ్రీవం...
తొలిదశ ఎన్నికల్లో 93 పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కానున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే పలు గ్రామ పంచాయతీల్లో ఒకే నామినేషన్ పడటంతో ఎన్నిక లాంఛనమే అయింది. వేలం పాటలో అత్యధిక మొత్తం సమకూర్చిన, గ్రామాభివృద్ధికి నిధులిచ్చిన, ప్రత్యర్థులతో రహస్య ఒప్పందం చేసుకున్నవారు పంచాయతీల్లో ఒకే నామినేషన్ వేశారు. వారికి పోటీగా మరో నామినేషన్ పడకపోవడంతో అవి కూడా ఏకగ్రీవం కాబోతున్నాయి.
ఇదీ చదవండి