విదేశాల్లోని వైద్య కళాశాలల్లో చదువుకునేందుకు ఉన్న ఆంక్షలను ఎన్‌ఎంసీ తొలగించింది. అయితే ఈ కళాశాలలు డబ్ల్యూహెచ్‌వో ప్రామాణికాలకు అనుగుణంగా ఏర్పాటై ఉండాలి. అలాగే ఆయా దేశాల్లోని వైద్య కళాశాలల గుర్తింపు, ఫీజులు, ఇతర సమాచారాన్ని అనుసరించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంసీ పేర్కొంది. దీనివల్ల విశ్వవిద్యాలయాలు, కళాశాలల మధ్య పోటీ పెరిగి.. ఫీజులు తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. వైద్య విద్యలో నాణ్యత పెరిగేందుకు వీలుంది.
మెడిసిన్ కల నెరవేర్చుకునేందుకు...!
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంబీబీఎస్ చదవడం కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. వైద్య సీట్ల కొరత, యాజమాన్య కోటా సీటు ఫీజులు అధికంగా ఉండటంతో విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు సిద్ధపడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్థాన్, జార్జియా, కజికిస్థాన్ వంటి కామన్‌వెల్త్ ఇండిపెండింట్ స్టేట్స్‌కూ, చైనా, ఫిలిప్పీన్స్, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఆసియా దేశాలకూ, జమైకా, గయానా, వంటి కరేబియన్ ద్వీప దేశాలకూ వెళ్లి మరీ తెలుగు విద్యార్థులు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. ఎంసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రపంచ దేశాల్లో గుర్తించిన వైద్య కళాశాలల జాబితాను పొందుపరుస్తోంది. తాము చేరదల్చిన కళాశాల ఈ జాబితాలో ఉంటేనే విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలుంది. గతంలో అమలులో ఉన్న ఇతర నిబంధనలన్నీ యధావిధిగా కొనసాగుతాయి.
ఇదీ చదవండి: