కొత్త ఇసుక విధానం రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి అమల్లోకి రానుంది. కొత్త విధానంలో ఇసుక విక్రయాలను కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు నిల్వ కేంద్రంలో గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 కేంద్రాల్లో అమ్మకాలు మొదలవుతాయి.
ప్రత్యేక పోర్టల్
ఆన్లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి శాండ్.ఏపీ.జీవోవీ.ఇన్ పొర్టల్ మొదలవుతుంది. ఎన్ని రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నాయి, నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక అందుబాటులో ఉందనేది ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఆన్లైన్లో చెల్లింపులు పూర్తి అవ్వగానే డెలివరీ ఎప్పుడవుతుందనే సందేశం సెల్‌ఫోన్ కు వస్తుంది.
13 జిల్లాలు..41 స్టాక్ పాయింట్లు
ఇసుక సరఫరా కోసం 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ సంఖ్యను అక్టోబరు నాటికి 70 నుంచి 80 స్టాక్ పాయింట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్దేశించారు. టన్నుకు కిలోమీటర్‌కు.4.90లు రవాణా ఖర్చుగా 10 కిలోమీటర్ల లోపు వరకూ ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు .500గా నిర్ణయం తీసుకున్నారు. ఇక పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యత ఏపీఎండీసీ చేపట్టనుంది. క్యూబిక్ మీటరుకు.రూ. 60 లు రైతులకు ఏపీఎండీసీ చెల్లించనుంది.
ప్రతి వాహనంలో జీపీఎస్
లోండిగ్ రూపంలో, తవ్వకాల రూపంలో రైతులకు ఎలాంటి భారం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ ఖర్చులను ఏపీఎండీసే భరించాలని సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 100 రీచ్‌లను ఏపీఎండీసీ సిద్ధం చేసింది. 31 చోట్ల డీ సిల్టేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనంలో జీపీఎస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా పైనా నిషేధం పెట్టారు. అటు ప్రయివేటు స్టాక్ పాయింట్ లకు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
అక్రమ తవ్వకాలపై కొరడా
అక్రమ తవ్వకాలు, అనధికార రవాణాపై అధికారులు కొరడా ఝళిపించనున్నారు. ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తూ తొలిసారి పట్టుబడితే 10వేలు, రెండోసారి దొరికితే 20 వేలు జరిమానా విధిస్తారు. 10 చక్రాల లారీని పట్టుకుంటే..తొలిసారి 25వేలు, రెండోసారి 50 వేల వరకూ జరిమానా చెల్లించాలి. పది కంటే ఎక్కువ చక్రాలుండే లారీని పట్టుకుంటే తొలిసారి 50 వేలు, రెండోసారి లక్ష వరకూ జరిమానా విధిస్తారు. ఇసుక తవ్వకాలు జరుపుతూ యంత్రాలు పట్టుబడితే.. తొలిసారి 50 వేలు, రెండోసారి లక్ష వరకూ జరిమానా విధిస్తారు. నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఇసుక తరలిస్తే...టన్ను అదనపు ఇసుకకు 2వేలు, జీపీఎస్ లేని వాహనం చిక్కినా..ఇదే విధంగా జరిమానా వసూలు చేస్తారు. ఇసుక అక్రమంగా నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుంటారు.