రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడుతుంది . కొన్నిఆసుపత్రుల్లో కొద్ది గంటల ముందు అప్రమత్తమై.... అధికారులు, పోలీసులు హడావిడిగా ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోగా....రోజురోజుకూ ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో..ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారనుంది. అందుకే అధికారులు నూతనంగా ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ల పునరుద్ధరణకు జాయింట్ కలెక్టర్లు సిద్ధమయ్యారు. పరిశ్రమల శాఖ నుంచి సమాచారం సేకరించి పాత ఆక్సిజన్ ప్లాంట్లకు జీవం పోసేలా చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలోఆక్సిజన్ బెడ్లు 23 వేల 259 బెడ్లు ఉంటే 22 వేల 265 బెడ్లు నిండిపోయాయి. ఆక్సిజన్ పడకలు 80 శాతం, సాధారణ పడకలు 60 శాతం నిండాయని తెలుస్తుంది . ఆక్సిజన్ పడకల కోసం బాధితులు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి నిరీక్షిస్తే తప్ప పడకలు దొరకట్లేదు. 590 టన్నుల ఆక్సిజన్ కోటాను కేంద్రం కేటాయించినా....కొరత తప్పడం లేదు. అందుకే రాష్ట్రంలో 49 ఆసుపత్రుల్లో 309 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం తెలిపామన్నారు. పీఎస్ఏ ప్లాంట్లను ఆయా ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ ల సామర్థ్యం బట్టి నిర్మించనున్నామన్నారు. 3 నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. 180 కోట్ల రూపాయలతో ప్లాంట్లు, సివిల్ వర్కులకు 25 కోట్ల రూపాయలు, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్ల కోసం 50 కోట్ల రూపాయలు, 50 క్రయోజినిక్ ట్యంకర్ల కొనుగోలు చేయాలని నిర్ణయించగా 25 ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇందుకోసం46 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇలా మొత్తం 309 కోట్ల రూపాయల మంజూరుకు అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంతో రవాణా, స్టోరేజ్ ఇబ్బందులు ఇక ఉండబోవని చెబుతున్నారు.
తాజాగా ఎన్హెచ్ఐఏ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది . 42 ప్రాంతాల్లో నూతన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఎన్హెచ్ఐఏ సిద్ధమైంది . ముందుగా నాలుగు ప్రాంతాల్లో పనులు ప్రారంభించనుందని ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. అమలాపురంలో 500 ఎల్పిఎమ్, మదనపల్లిలో 500 ఎల్పిఎమ్ ,తాడేపల్లిగూడెంలో 1000ఎల్పిఎమ్ , హిందుపురంలో 1000 ఎల్పిఎమ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది . ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఎన్హెచ్ఐఏ పనులు ప్రారంభించిందన్నారు . నేటి నుంచి అమలాపురం సైట్ లో అధికారులు పనులు ప్రారంభిస్తారని తెలిపారు. మిగిలిన 38 సైట్స్ లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం వెండర్స్ జాబితా ఖరారు చేసినట్లు వివరించారు. ఎన్హెచ్ఐఏ ప్రధాన కార్యాలయం ఆదేశాలు వచ్చాక 38 ప్రాంతాల్లో పనులు ప్రారంభిస్తారన్నారు
ఇదీచదవండి