రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత.. ఇలా మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. త్వరలో ఇవి ఆరు రకాలుగా మార్పు చెందనున్నాయి. పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 ప్రవేశ పెట్టడం, జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురాబోతోంది. అంగన్‌వాడీలు- ప్రాథమిక బడులు- ఉన్నత పాఠశాలలకు మధ్య ఉన్న దూరానికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తోంది. కొత్త విధానంలో పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు ఆరు రకాల పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి.
* అంగన్‌వాడీలను శాటిలైట్ ఫాండేషన్ పాఠశాలలుగా మార్పు చేస్తారు. ఇక్కడ పీపీ-1, 2 మాత్రమే బోధిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రతి ఆవాసంలోనూ వీటిని ఏర్పాటు చేస్తారు.
* పీపీ-1, 2, ఒకటి, రెండు తరగతులు బోధించే బడులను ఫౌండేషన్ పాఠశాలలుగా పిలుస్తారు. విద్యార్థుల ఆవాసాలకు కిలోమీటరులోపు దూరంలో ఇవి ఉంటాయి. ఉన్నత పాఠశాలలకు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి, హైస్కూళ్లలో కలుపుతారు. మిగిలే 1, 2 తరగతులకు అదనంగా పీపీ-1, 2 ప్రారంభిస్తారు.
* ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పీపీ-1, 2 ప్రారంభించి, వీటిని ఫౌండేషన్ ప్లస్ బడులుగా మారుస్తారు. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉంటాయి.
* ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ప్రీహైస్కూళ్లు రానున్నాయి. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-7 తరగతులు ఉంటాయి.
* ప్రస్తుత ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు ఉండగా... ఇకపై 3-10 తరగతులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉన్నత పాఠశాలలకు సమీపం లేదా అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసి, ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు.
* విద్యార్థుల డిమాండును అనుసరించి ప్రతి మండలానికి ఒకటి/రెండు జూనియర్ కళాశాలలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని కళాశాలలను దూరాన్ని అనుసరించి పాఠశాలల ప్రాంగణానికి తరలిస్తారు. 3-12 తరగతులు ఏర్పాటు చేసి, హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేస్తారు.
ఇదీ చదవండి: WATER DEMAND: మాకు 27 టీఎంసీలు కావాలి: కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ లేఖ