కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం చెముడు లంకలో ఉన్న శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ విద్యార్థులు ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. జాతీయ గీతాలను ఆలపిస్తూ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్లు, సైనికుల వేషధారణలు ఎంతో అలరించాయి. అనంతరం గ్రామంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా: ఆజాదిక అమృత మహోత్సవలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాతో భారీ కవాతు నిర్వహించారు. పట్టణ వీధులు గుండా సాగిన ఈ ప్రదర్శనలో జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. జాతీయతను ప్రదర్శించే పలు నినాదాలు చేశారు.
అనంతపురం జిల్లా: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం 500 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాయదుర్గం ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కళాశాల విద్యార్థులు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వినాయక సర్కిల్ వరకు భారీగా ర్యాలీ చేస్తూ ప్రదర్శించారు. వందేమాతరం, జాతీయ జీతాలను అలపిస్తూ జాతీయ జెండాను చేతిలో పట్టుకుని పురవీధుల్లో ఊరేగించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉట్టిపడే విధంగా విద్యార్థులు, అధ్యాపకులు భారతదేశం జెండాను ప్రదర్శించడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద పబ్లిక్ హైస్కూల్ యజమాన్యం ఆధ్వర్యంలో 750 అడుగుల జెండాన ప్రదర్శనను జూనియర్ సివిల్ జడ్జ్ సుభహాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బళ్లారి రోడ్డు, జగజీవన్ విగ్రహం మీదుగా వివేకానంద స్కూల్ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు పెరగాల్సిన అవసరం ఉందని తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. హర్ ఘర్ తిరంగా నినాదంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపులో భాగంగా చింతమనేని ప్రభాకర్ దెందులూరు మండలం దుగ్గిరాలలోని స్వగృహంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఇళ్లపై ఆవిష్కరించి దేశభక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామంలో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం, జై హింద్ అంటూ నినదించారు.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట చేగు విద్యాలయం ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తిరంగ్ ర్యాలీ ఘనంగా జరిగింది. 75 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో స్వతంత్ర సమరయోధుల వేషధారణ, అన్నీ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల వేషధారణ, ఘోష్ ధ్వనులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
అజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా విజయవాడ పిన్నమనేని బ్రహ్మయ్య సిద్దార్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో హెరిటేజ్‌వాక్ నిర్వహించారు. 1000 అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టి... ఎన్‌సీసీ, విద్యార్ధులు ప్రదర్శన చేశారు.
దేశభక్తి... దేశ సమగ్రతను చాటేందుకే హర్‌ఘర్ తిరంగా కార్యక్రమమని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రులు జోగి రమేష్, విడదల రజని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు రజత్‌భార్గవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజయవాడ బందరు రోడ్డులో ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. సుమారు 15 వేల మంది విద్యార్ధులతో మూడు కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శనగా ఈ ర్యాలీ కార్యక్రమం రూపొందించారు. మన జెండా... మన పింగళి నినాదంతో పింగళి వెంకయ్యకు నివాళులు అర్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని- అందుకు అధికార యంత్రాంగం జెండాలను కూడా పలు ప్రాంతాల్లో పంపిణీ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డిల్లీరావు తెలిపారు. జాతీయ నాయకుల వేషదారణలు, విద్యార్ధుల నృత్యాలు అలరించాయి.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇంటింటికీ జాతీయ పతాక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విజయనగరంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు, డిర్‌డిఏ, మెప్మా, స్త్రీశిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల సిబ్బంది నిర్వహించిన తిరంగా ఉత్సవ ర్యాలీని స్థానిక చెన్నారెడ్డి భవనం వద్ద డీఆర్‌డీఏ పిడి కల్యాణచక్రవర్తి ప్రారంభించారు. మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహం మీదుగా ఈ ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంది. జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం నిర్వహించి, మువ్వన్నెల బెలూన్లను ఎగురవేశారు.
విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజుతో పాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు పాల్గొన్నారు. ర్యాలీ శ్రీ గురజాడ అప్పారావు గారి విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై గురజాడ అప్పారావు ఇంటి మీదుగా మూడు లాంతర్లు, గంటస్థంభం మీదుగా కన్యకాపరమేశ్వరి కోవెల వద్దకు చేరుకుని అక్కడ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
చిత్తూరు జిల్లా: సాయిమాత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కుప్పం వీధుల్లో 3 వేల అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇందులో విద్యార్దులు, నాయకులు, పుర ప్రముఖులు వేలాదిగా పాల్గొన్నారు. దేశ భక్తి నినాదాలు చేశారు.
అన్నమయ్య జిల్లా: సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మదనపల్లిలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా రాయచోటి, పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారతదేశ చిత్రపటం నమూనాలో పెద్ద సంఖ్యలో మహిళలు... ఉప్పు కంకరతో రంగోలితో కూడిన జాతీయ జెండాను తీర్చిదిద్దడంతో త్రివర్ణ జెండా అందరిని ఆకర్షిస్తుంది. మహిళలు రంగోలి పోటీలో భారతదేశ చిత్రపటంలో జాతీయ జెండాను తయారుచేసి తమ ప్రతిభను చాటుకున్నారు.
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో సోమప్ప కూడలిలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీగా వచ్చి మానవహారంగా ఏర్పడ్డారు. నందవరంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావడంతో 75 సంఖ్య ఆకారంలో నిలబడి నినాదాలు చేశారు.
ఏలూరు జిల్లా: నగరంలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి...అనంతరం కూడలిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జైహింద్, జైభారత్, వందేమాతరం అంటూ విద్యార్థులు నినదించారు.
వైఎస్సార్ జిల్లా: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మైదుకూరులో ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణంలో త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన చేశారు. వందేమాతరం అంటూ నినదిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
ఆజాధిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బళ్లారి మోతి సర్కిల్లో భారీ జాతీయ పతాకాన్ని మంత్రి బళ్లారి శ్రీరాములు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పవన్ పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రముఖుల చేత జాతీయ పతాకాలను రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
కమలాపురంలో స్థానిక డిగ్రీ, పీజీ కళాశాలలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ విభజన సమయంలో దేశం నలుమూలల ప్రజలలో నెలకొన్న మనోభావాలను అందరికీ తెలిసే విధంగా ఈ చిత్రాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా: ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు జాతీయ జెండాను పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగించారు.
ప్రకాశం జిల్లా: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1000 మంది విద్యార్థులు... ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా పుల్లల చెరువు సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులు చేసిన విన్యాసాలు, విద్యార్థినులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి: