తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలు కాపాడాలని.. హిందూపురం శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. జన్యులోపం వల్ల వచ్చే ఈ వ్యాధి చికిత్సకు రక్తమార్పిడి ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటంతో పాటు దానిని ప్రోత్సహించాలని కోరారు. మానవాళిని పట్టి పీడిస్తున్న అనేక వ్యాధుల్లో తలసేమియా ఒక్కటన్న బాలకృష్ణ... బిడ్డ పుట్టిన 6 నెలల నుంచి 18 నెలల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని, 3 నెలలకోసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. త్వరితగతిన చికిత్స అందించకుంటే చిన్నారుల ప్రాణాలకే ప్రమాదం ఉందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది ఏటా తలసేమియా బారిన పడుతుంటే మన దేశంలో ఏటా 10 నుంచి 12 వేల మంది ఈ వ్యాధితో జన్మిస్తున్నారని వెల్లడించారు. కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేము కాబట్టి.. రక్తదానం చేయటం ద్వారానే చిన్నారుల ప్రాణాలు కాపాడగలమని స్పష్టం చేశారు. ప్లాస్మా, రక్తదానం చేయటం వల్ల ఎలాంటి అరోగ్య సమస్యలు తలెత్తవన్న బాలకృష్ణ.. రక్తదానం చేసేవారు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయడమే కాక రక్తదానాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ తెలుగు యువత రక్తదాన శిబిరం కోసం బాలకృష్ణ వీడియో సందేశం ఇచ్చారు.
ఇదీ చదవండి: