రాష్ట్రంలో 'రోడ్ల మధ్య గోతులున్నాయా..? గోతుల మధ్య దారులున్నాయా?' అనే అనుమానం కలుగుతోందని జనసేన పార్టీ ఆరోపించింది. అధ్వానమైన రోడ్లతో ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల ఇక్కట్లు తెలుసుకోవడానికి జగన్రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేసింది. రోడ్ల మరమ్మతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనసేన ఉద్యమబాట పట్టబోతోందని పేర్కొంది. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఫొటోల రూపంలో డిజిటల్ వేదికల ద్వారా ఉద్యమం సాగిస్తామని ప్రకటించింది.
”జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్” అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో రోడ్లను చూపిస్తామని జనసేన తెలిపింది. నెలరోజుల్లో ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా గాంధీ జయంతి రోజున శ్రమదానం ద్వారా నియోజకవర్గంలో ఒక రోడ్డుకు తమ పార్టీ మరమ్మతులు చేస్తుందని.. రెండు జిల్లాల్లో నిర్వహించే శ్రమదానం కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొంటారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సంక్షేమ నినాదంతో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు
మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలు చేసిన కృషిని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా గుంతలు పడిన రోడ్లతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు బాధాకరంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించే జాతీయ రహదారులు కాకుండా రాష్ట్ర పరిధిలో లక్షా 26వేల కిలోమీటర్ల రహదారులున్నాయని.. గత రెండేళ్లుగా వైకాపా ప్రభుత్వం వాటి మరమ్మతులను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.12,450 కోట్ల నిధులు కేటాయించినట్లు చూపించారే తప్ప ఎక్కడా తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం నిర్వహణ కోసమే రూ.1350 కోట్లు ఖర్చు చేశామని వైకాపా ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు పెద్ద మోసమన్నారు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు గ్రామల్లో సీఎం జగన్ ఇప్పుడు తిరగాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: COVID: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం..ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్