ప్రేమించిన యువతితో పెళ్లి కోసం మతం మారిన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యువకుడు భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ హునైన్కు రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో చేదు అనుభవం ఎదురైంది. హునైన్ పెట్టుకున్న దరఖాస్తును మానవ హక్కుల సంఘం కొట్టివేసింది. వికారాబాద్ జిల్లా లాలగూడకు చెందిన భాస్కర్... మన్నెగూడలో ఉంటోన్న నిఖత్‌ను ప్రేమించానని, వాళ్ల పెద్దల సూచన మేరకు ఇస్లాంలో చేరి పూర్తిగా మారిపోయాడు. పెళ్లి చేస్తానన్న అమ్మాయి తరఫు వారు దాడి చేసి మోసం చేశారని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. హునైన్ అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ చంద్రయ్య... నిఖత్‌ను కోర్టులో హాజరుపర్చాలని స్థానిక మహిళా పోలీసులను ఆదేశించారు.
నిఖత్ అభ్యర్థన మేరకు కొట్టివేత
మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు వికారాబాద్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ సుష్మిత.... నిఖత్‌ను కోర్టులో హాజరుపర్చారు. నిఖత్, హునైన్ల వాదనలు విన్న జస్టిస్ చంద్రయ్య... నిఖత్ అభ్యర్థన మేరకు హునైన్ పిటిషన్‌ను కొట్టివేశారు. హునైన్ తన తండ్రిని మద్యానికి బానిసను చేసి మోసం చేశాడని, తనను తీవ్రంగా వేధిస్తున్నాడని నిఖత్ ఆరోపిస్తోంది. నిఖత్ మాటలన్నీ అవాస్తవమని, మత పెద్దలు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని హునైన్ వేడుకుంటున్నాడు. నిఖత్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
ఇవీ చూడండి: