ENERGY SWARAJ YATRA: సోలార్ బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న ఈయన పేరు చైతన్య సింగ్ సోలంకి. ముంబయి ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సోలంకి.... సౌర విద్యుత్‌పై అనేక పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఇంధన వనరుల వినియోగం వల్ల పెరిగిపోతున్న కాలుష్యం.. దాని పర్యవసానంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఆయనను ఆందోళనకు గురిచేశాయి. కాలుష్యం కారణంగా రుతువులు గతి తప్పి.. విశ్వం భవితవ్యమే అంధకారం కాబోతోందని... దీని దుష్ఫలితాలు ముందు తరాలు అనుభవించబోతున్నాయని ఆయన అంటున్నారు.
"ఇప్పటికే వాతావరణ మార్పు ప్రభావాన్ని మనమంతా అనుభవిస్తున్నాం. ఈ విషయం చెప్పడానికి శాస్త్రవేత్తలు, పరిశోధనలు పెద్దగా అవసరం లేదు. ఈ మార్పునకు కారణం ఎవరంటే మనమే. పెట్రోల్, డీజిల్, థర్మల్ విద్యుత్, గ్యాస్ వంటి కర్బన ఇంధనాలను వాడటం ద్వారా మనమంతా కాలుష్యానికి కారణం అవుతున్నాం." - చైతన్య సింగ్ సోలంకి, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్
పర్యావరణ విధ్వంసంపై ప్రజలను జాగృతం చేయడమే తన లక్ష్యంగా భావించారు సోలంకి. నూటికి నూరు శాతం సౌర శక్తిని వాడినప్పుడే ఈ దుష్పరిణామాలు అంతమవుతాయని భావిస్తున్న ఆయన... ఆ దిశగా జనంలో చైతన్యం నింపాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి పదేళ్లపాటు సెలవు పెట్టి.. ఎనర్జీ స్వరాజ్ యాత్ర ప్రారంభించారు. ఓ బస్సులో దేశమంతా ప్రయాణిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సోలంకి చేపట్టిన ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్ర.. పదేళ్ల పాటు సాగనుంది. సౌరశక్తిపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం... ప్రతి ఇంట్లో సౌరశక్తిని ఉపయోగించేలా ప్రేరేపిచడం ఆయన యాత్ర లక్ష్యాలు. యాత్ర కోసం సోలంకి స్వయంగా ఓ సౌర బస్సును తయారు చేసుకున్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో సుదీర్ఘ యాత్రకు సంకల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రయాణించి దారిపొడవునా ప్రజలకు, విద్యార్థులకు సౌరశక్తిపై అవగాహన కల్పించడం ఆయన దినచర్య. ఈ పదేళ్ల యాత్రలో ఎప్పుడు ఎక్కడకి చేరుకోవాలి.. ఎక్కడ బస చేయాలి అనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. యాత్రకు అవసరమైన అన్ని వసతులు బస్సులోనే సమకూర్చుకున్నారు.
"పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే అని జనం అనుకుంటూ ఉంటారు. కాని అది సరికాదు. గత పాతికేళ్లుగా అనేక ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఆ దిశగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అందుకే మనమంతా ఈ సమస్య పరిష్కారంలో భాగస్వాములం కావాలి. మన పిల్లల భవిష్యత్ కోసమైనా సరే మనం ఇక నుంచి సౌర విద్యుత్‌నే వాడాలి." - చైతన్య సింగ్ సోలంకి, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్
చైతన్య సింగ్ సోలంకి.. గతంలో మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ సౌర గ్రామంగా తీర్చిదిద్దారు. అందుకు ప్రధానమంత్రి ఆవిష్కరణ అవార్డు అందుకున్నారు. సౌర విద్యుత్ రంగంలో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా స్థాపించారు. ఇప్పటి వరకూ 28 సైన్స్ అవార్డులు అందుకున్నారు. భూమిని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలని సోలంకి సూచిస్తున్నారు.
"మనం శక్తి వనరుల నుంచి స్వేచ్ఛ పొందాలి. అప్పుడే దేశానికి శక్తి వనరుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడే భవిష్యత్ తరాలు సౌకర్యవంతంగా జీవించే వాతావరణం ఏర్పడుతుంది. కాలుష్యంలో కాకుండా పరిష్కారంలో భాగస్వాములం అవుతామని అందరూ ప్రతినబూనేలా చేయడమే నా ఎనర్జీ స్వరాజ్ యాత్ర లక్ష్యం." - చైతన్య సింగ్ సోలంకి, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్
ఒక ఉన్నత ఆశయం కోసం పదేళ్లపాటు కుటుంబానికి దూరమై... దేశ ప్రజలను మేల్కొలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ఐఐటీ ప్రొఫెసర్.. తన లక్ష్యసాధనలో విజయం సాధించాలని ఆశిద్దాం.
ఇవీ చదవండి: