CM Chandrababu on 150 Days Rule : ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఏపీ దేశంలో నెంబర్ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేకపోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడించారు.
రహదారుల కోసం సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - గోదావరి జిల్లాల నుంచే అమలు
భవిష్యత్‌లో 3.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్ ఫస్ట్ అన్న సీఎం అందుకే మొదటి సంతకం 16 వేల 300 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా, పర్యాటకంగా, చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్త విధానాలను తీసుకువచ్చామని అన్నారు.
రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులోనూ 85 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. 34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు. అలాగే 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. రిలయన్స్ బయో సంస్థ కూడా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు, అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం, మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు - 10 భారీ పరిశ్రమలకు లైన్ క్లియర్
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ చేస్తామని, ఆ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని, వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఫింగర్ ప్రింట్ అనాలసిస్ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సజావుగా సాగాలంటే సుపరిపాలన ఉండాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు 2024కు తీసుకువస్తున్నామన్న సీఎం, ఇందులో భూ ఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తప్పని తేలితే 14 ఏళ్లు జైలు శిక్ష భారీ జరిమానా ఉంటుందన్నారు.
మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, బెల్టు దుకాణాలు వస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. మద్యం అక్రమాల విషయంలో మన, తన అనే బేధాలు ఏవీ ఉండవని తెలిపారు. ఉచిత ఇసుక సరఫరా విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చిచెప్పారు. ఐదేళ్ల పాటు చీకటి జీవోల ద్వారా పాలన సాగించారని, వాటన్నింటినీ ఆన్లైన్లో పెడుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పౌర సేవలన్నీ ఇకపై వాట్సప్‌లో ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. రెవెన్యూ, దేవాదాయ, రవాణా, ఆర్టీసీ, గ్రీవెన్సు ఇలా వివిధ శాఖల సేవలు ఇక వాట్సప్ ద్వారా ఇస్తామన్నారు. 150 ప్రభుత్వ సేవలు ఆన్లైన్, వాట్సప్ ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
శాసనసభ వేదికగా 2047 విజన్ డాక్యుమెంట్: నదుల అనుసంధానం కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, ఆదాయం, సాంకేతికతతో కూడిన సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని వెల్లడించారు. ఓర్వకల్లులో డ్రోన్స్ సిటీ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ, పైలట్ ట్రైనింగ్, ఉత్పత్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో సవాళ్లు, సమస్యలు చాలా ఉన్నాయన్న సీఎం, రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా మంత్రుల కమిటీ నియమించామన్నారు. శాసనసభ వేదికగా 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు.
2027లోపు పోలవరం పూర్తి - జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు: సీఎం చంద్రబాబు
CBN on AP Brand and Social Media : విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టాలు వారసత్వంగానే వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ పోయిందని, సమస్యలు కూడా వచ్చాయన్నారు. వ్యవస్థలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. రాష్ట్రానికి దశ దిశ చూపించటంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాముల బలిదానం వృథాగా పోదని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర్యం రాకముందు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ ఎంతమంది వచ్చినా అన్నం పెట్టారన్న సీఎం, అందుకే మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అరాచకాలు, గంజాయిపై డిప్యూటీ సీఎం చాలా గట్టిగా ఉన్నారని, తాము ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. మహిళలకు అవమానం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు, నక్సల్స్‌ను నియంత్రించానని తెలిపారు.
కొందరు రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లు ఉన్నాయి. వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెబుతున్నామని అన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఉక్కుపాదంతోనే అణచివేస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్ కావాలని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
CM Chandrababu Comments: రైతులు పంపుసెట్ల వద్ద సౌరవిద్యుత్ ప్యానళ్లు పెట్టుకుంటే మిగిలిన విద్యుత్ విక్రయించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా తిరిగి సొమ్ము పొందే అవకాశం రైతులకు ఉంటుందని వెల్లడించారు. దీనిపై శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులను ప్రోత్సహించాలని సూచించారు.