దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పేరిట.. ఈ నెల 15 మొదలైన వేడుకలతో భద్రాద్రి క్షేత్రం పులకించిపోతోంది. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం కోసం భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ సాయంత్రం జరిగే తెప్పోత్సవం, శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముక్కోటి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలను వీక్షించేందుకు ఏటా వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు.
వేడుకలపై కొవిడ్ ప్రభావం
ఈ ఏడాది ఉత్సవాలపై కొవిడ్ ప్రభావం పడింది. ప్రభుత్వాదేశాల మేరకు... ఈసారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం... భక్తుల సందడి లేకుండానే జరగనున్నాయి. ఏటా గోదావరిలో జరిపే తెప్పోత్సవ వేడుకను ఈసారి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో నిర్వహించనున్నారు.
భక్తులు లేకుండానే...
శుక్రవారం తెల్లవారుజామున... మిథిలా ప్రాంగణం ఎదురుగా గల ఉత్తర ద్వారం నుంచి స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకకు భక్తులకు అనుమతి లేదు. కేవలం అర్చకులు, ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా కమనీయంగా సాగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు... ఈ సారి నిరాశ తప్పడం లేదు.
ఇదీ చూడండి: 'ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్'