పార్లమెంటు సమావేశాల్లో 31 బిల్లులు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చించాలని తాము కోరామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు చెల్లించలేని ఆర్థిక దుస్థితి నెలకొందని, ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. కేంద్ర నిధులను దారి మళ్లించారని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే వాటిని ఇవ్వమని కేంద్రానికి చెప్పి పోరాటం చేయలేని పరిస్థితుల్లో సర్కారు ఉందని మండిపడ్డారు. కేసులకు భయపడి రాష్ట్ర సమస్యలపై పోరులో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడుతోందన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని, రాష్ట్ర వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలని కోరతామని చెప్పారు. నీటి వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగా లేదని, తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేయలేక కేంద్రానికి లేఖ రాసి గెజిట్ మా ఘనతేనని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నీటిని వాడుకునే హక్కు ఉన్నా వృథాగా సముద్రంలోకి వదిలేశారని, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలతో రాజీపడిపోయారని మండిపడ్డారు. ఎప్పటి నుంచో ఉన్న తెలుగుగంగ, గురు రాఘవేంద్ర, వెలిగొండ ప్రాజెక్టులను గెజిట్‌లో ఆమోదం పొందని ప్రాజెక్టులుగా చూపినా మాట్లాడే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. 2016లో జరిగిన అపెక్స్ కమిటీలో ఉమ్మడి ప్రాజెక్టులపై ఏ ఒక్క ప్రభుత్వం ఆధిపత్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సూచించారని తెలిపారు. నాటి సమావేశం ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చామని కేంద్రం చెబుతుంటే మేం చెప్పబట్టే వచ్చిందని వైకాపా ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండీ.. AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..