DISTRICT HEADQUARTERS : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటికి.... ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 మధ్య సీఎం కొత్త జిల్లాలను ప్రారంభిస్తారని, జిల్లాల వారీ సమాచారంపై పుస్తకాలు విడుదల చేస్తారని చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గ ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా ఆలోచన చేశామని తెలిపారు. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడున్న కేంద్రానికి దగ్గరగా ఉండటం.. ఆ నియోజకవర్గాన్ని పక్క జిల్లాలో చేర్చితే ప్రజలు ఇబ్బంది పడతారని భావించినప్పుడు కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
12 మంది ఎమ్మెల్యేలకు రెండు జిల్లాల్లో ప్రాతినిధ్యం: విజయనగరంలో మెంటాడ, విశాఖపట్నంలో పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి, గోకవరం, తాళ్లరేవు, కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమల, నెల్లూరు జిల్లాలో రాపూరు, సైదాపురం, కలువాయి, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, వడమాలపేట, కడప జిల్లాలో సిద్దవటం, ఒంటిమిట్ట, కర్నూలు జిల్లాలో పాణ్యం, గడివేముల, అనంతపురం జిల్లాలో రామగిరి, కనగానపల్లె, చెన్నైకొత్తపల్లి మండలాలకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మండలాలన్నీ.. ప్రతిపాదించిన జిల్లా నుంచి పక్క జిల్లాకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయంతో 12 నియోజకవర్గాల్లోని శాసనసభ్యులకు రెండు జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించనుంది.
చివరకు 72కు చేరింది: చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు.. రెవెన్యూ డివిజన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎనిమిది మండలాలుంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు 51 రెవెన్యూ డివిజన్లను 62కి పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా చేయగా.... చివరకు ఆ సంఖ్య 72 రెవెన్యూ డివిజన్లకు చేరిందన్నారు. డివిజన్ కేంద్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు ఉంటే అధికారులు ఉండటానికి, ప్రజలకు అనుకూలంగా ఉంటాయనే ఆలోచనతో కొన్ని మండలాలకు దూరమైన రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందుకే మూడు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాను చేశాం: రంపచోడవరం, ఎటపాక, మారేడుమిల్లి, దేవీపట్నం జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల పైనే దూరం ఉన్నాయి. రాజవొమ్మంగి, అడ్డతీగల సుమారు 200 కిలోమీటర్ల లోపు ఉన్నాయి. దీనిపై విస్తృత చర్చ జరిగిందన్న విజయ్‌కుమార్...కేవలం అరకు, పాడేరుకే ఒక జిల్లా ఏర్పాటు సాధ్యం కాదు కాబట్టి...మూడు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేశామన్నారు. ఈ ఇబ్బందిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్, సిబ్బంది వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరం నుంచే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని వెల్లడించారు.
ఇదీ చదవండి: జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జడ్పీలపై కీలక నిర్ణయం