ముఖ్యమంత్రి జగన్, మంత్రుల తీరుపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవను మంత్రులు గాలికి వదిలేశారని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఐటీ సోదాల పేరుతో తెదేపాపై అవినీతి నింద వేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. సూట్ కేసు కంపెనీల్లో 43 వేల కోట్లు జగన్ దాచుకున్నారని.. అలాంటి వారు తమ పార్టీపై నిందలేయడం ఏంటని నిలదీశారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్న శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. 2వేల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని వైకాపా నేతలు... జగన్, విజయసాయి దగ్గర ట్యూషన్ పెట్టించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ కు ఉన్నట్లు తమకు ప్యాలెసులు లేవని.. ప్రజాసేవే తమ పార్టీ అధినేత ధ్యేయమని చెప్పారు. రావాలి జగన్ అన్న ప్రజలే నేడు పోవాలి జగన్ అంటున్నారని వ్యాఖ్యానించారు.
అందుకోసమే దిల్లీ పర్యటనలు
కార్పొరేషన్ ఆస్తులను అమ్మి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. అరెస్టైన నిమ్మగడ్డ నోరు విప్పితే ఏ1, ఏ2 పరిస్థితి ఊహించలేనిదని అన్నారు. అందుకే సీఎం జగన్ తరచూ దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలనూ తాకట్టు పెట్టేందుకు వెనుకాడట్లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: