ద్రవ్య వినిమయ బిల్లు సహా మరో ఆరు బిల్లులను శాసనమండలిలో ఆమోదించుకునే క్రమంలో సభలో ఎన్నడూ జరగని దురదృష్టకర ఘటన జరిగిందని వైకాపా నేతలు తెలిపారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తెదేపా నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు సహకరించాలని కోరుతున్నా.. సెక్షన్ 90ని తీసుకువచ్చి చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రులు తెలిపారు. నియమావళి పాటించకుండా.. బిల్లులను అడ్డుకోవడంలో కుట్రపూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసారి శాసనమండలి ఛైర్మన్ సహా డిప్యూటీ ఛైర్మన్లు తప్పు చేశారని అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. బిల్లులు ఆమోదం పొందకుండానే నిరవధికంగా వాయిదా వేశారని.. దీని వల్ల ఉద్యోగుల జీతభత్యాలు సహా ప్రజావసరాల కోసం ఒక్క రూపాయి కూడా వాడుకోలేని దుస్ధితి ప్రభుత్వానికి వచ్చిందన్నారు.
అడ్డగోలుగా వ్యవహరించారు
శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లిపై తెదేపా సభ్యులు దాడి చేశారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమకు మెజార్టీ ఉందని తమ మాట సాగకపోతే విధ్యంసం సృష్టిస్తామని.. విపక్ష నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారన్నారు. రాజకీయ లభ్ది కోసం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టిన తెదేపా.. సభలో అడ్డగోలుగా వ్యవహరించిందని మంత్రి ఆక్షేపించారు.
నిబంధనలు పట్టవా..?
తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిబంధనలకు విరుద్ధంగా తన సెల్ఫోన్లో సభ లోపలి దృశ్యాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని.. వ్యవసాయ మంత్రి కన్నబాబు ఆరోపించారు. దీన్ని ప్రశ్నించి అడ్డుకోబోయినందుకు తెదేపా నేత బీద రవిచంద్ర సహా.. మరికొందరు సభ్యులు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని ఆక్షేపించారు. మండలి ఛైర్మన్ సహా డిప్యూటీ ఛైర్మన్ పక్షపాతంగా వ్యవహరించారని మంత్రి విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలని ఆర్థిక శాఖ మంత్రి పలుమార్లు వేడుకున్నా పట్టించుకోలేదన్నారు.
బుధవారం బ్లాక్‌డే..!
సభలో ఘటనలు జరిగిన రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విపక్ష నేత యనమల తీరు అభ్యంతరకరంగా ఉందని.. దీని వల్ల పెద్దల సభ చిన్నబోయిందన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించే విషయమై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని... ఎవరినీ ఉపేక్షించమన్నారు.
ఇదీ చూడండి..
మండలిలో నారా లోకేశ్‌పై దాడికి యత్నించారు: తెదేపా ఎమ్మెల్సీలు