వైయస్‌ఆర్ బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఎన్‌రోల్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాల్లోని జేసీలు, డీఆర్‌డీఏ పీడీ, ఏపీడీ, బ్యాంకర్లతో ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రైస్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమాతో భరోసా కల్పించాలని అన్నారు. ఏటా వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం తరుఫున ప్రీమియంగా బ్యాంకులకు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. అనుకోని ఆపద వచ్చి.. పేద కుటుంబాలు రోడ్డున పడకూడదని.. కష్ట సమయంలో వారికి నిర్దేశించిన బీమా మొత్తాన్ని ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎన్‌రోల్‌మెంట్ బాధ్యత వీరిదే!
జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీ, ఏపీడీలు తమ పరిధిలో వైయస్‌ఆర్ బీమా ఎన్‌రోల్‌మెంట్ ఎలా జరుగుతుందో నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బీమా ఎన్‌రోల్‌మెంట్‌ను నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయలని అన్నారు.
55.57 లక్షల కుటుంబాలు పెండింగ్..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.43 లక్షల మంది బీమా కింద ఎన్‌రోల్ చేసుకున్నారని.. ఇంకా 55.57 లక్షల కుటుంబాలను ఎన్‌రోల్ చేయాల్సి ఉందని మంత్రి అన్నారు. రానున్న 45 రోజుల్లో ఈ మొత్తం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డులుండగా.. వాటిల్లో 1.35 కోట్ల కుటుంబాల్లో సర్వే పూర్తయ్యిందని పేర్కొన్నారు. మిగిలిన కుటుంబాల సర్వే సైతం 3 వారాల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
బ్యాంకర్లు సహకరించాలి..
బీమా పథకం దరఖాస్తులు ఇంకా బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండటంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ బీమా పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు. ఇదే సందర్భంగా బ్యాంకు సిబ్బందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి:
ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ