ఆంధ్రప్రదేశ్‌లో 30 నైపుణ్యాభివృద్ది కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) తీర్చిదిద్దడానికి వీలుగా జాతీయ, ప్రైవేటు సంస్థలను వ్యూహాత్మక భాగస్వాములుగా చేసే ఉద్దేశంతో పలు సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటీడీసీ) ఎండీ కమలవర్ధనరావు, జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) సీఎండీ గురుదీప్ సింగ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సీఎండీ అనిల్ కుమార్ చౌదరిలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
‘ఆంధ్రప్రదేశ్‌లో ‘టూరిజం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ రానుందని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఐటీడీసీతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనుంది. పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని ఐటీడీసీ ఎండీ చెప్పారు. అనకాపల్లిలో ఎన్టీపీసీకి సంబంధించి కేంద్రం ఏర్పాటుపై ఆ సంస్థ సీఎండీ సానుకూలంగా స్పందించారు. కడపలో ఉక్కు రంగానికి సంబంధించిన కేంద్రం ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తెలుపుతామని సెయిల్ సీఎండీ అనిల్‌కుమార్ చెప్పారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించాలని కోరాం...’ అని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో కూడా మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారని సమాచారం. ఆయనతో పాటు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ ఉన్నారు.
ఇదీ చదవండి: ఇంట్లో ఉంటే వైద్యం అందదంతే!