KTR at HICC: ప్రపంచ టాప్ ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం మనదే: కేటీఆర్ - KTR at HICC
KTR at HICC: దేశంలోని ఇతర మహానగరాల కంటే మౌలిక వసతులు, సదుపాయాల విషయంలో హైదరాబాద్ మేటి అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీ నాస్‌కామ్ జీసీసీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. నైపుణ్యమున్న యువతకు కొదవలేదన్న మంత్రి ఐటీ కంపెనీలకు కేరాఫ్‌గా మారిందన్నారు.
KTR at HICC: సుస్థిర పాలన, సమర్థ నాయకత్వంలో రాష్ట్రం దూసుకెళ్తుందని.. అందుకే విదేశీ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో టాప్ ఫైవ్ ఐటీ కంపెనీలు తమ రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్ కంపెనీలు తమ సంస్థలను నగరంలో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. నివాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా హైదరాబాద్ నిలుస్తోందన్నారు. హెచ్ఐసీసీలో నాస్కామ్ 12వ ఎడిషన్ జీసీసీ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మూడురోజులుగా జరుగుతున్న సదస్సులో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. బెంగుళూర్లో ట్రాఫిక్, చెన్నైలో హుమిడిటీ, ముంబయిలో ఖర్చుతో కూడుకున్నందువల్ల హైదరాబాద్ అద్భుతమైన కేంద్రంగా మారిందన్నారు. అత్యున్నతమైన బిసినెస్ స్కూల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనువైన పాలసీలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. టీ హబ్, వీ హబ్ ద్వారా స్టార్టప్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నాయన్నారు. ఎన్నికలపై కేవలం ఆరు నెలలపాటు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టి.. మిగతా నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి, ఆర్టికవృద్ది, ఉద్యోగకల్పనపై దృష్టి పెడతామన్నారు.
ఇవీ చదవండి: