KTR Participated Ambedkar Jayanthi Celebrations: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్... అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్, సారంపల్లి, అంక్సాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగానే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేటీఆర్ తెలిపారు. వెనుకబడిన తరగతుల వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇవాళ నేను మంత్రిగా మీముందున్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే... కేసీఆర్ నేతృత్వంలోని పోరాటం ఒకవైపు అయితే... అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒకటే రాజ్యాంగం ఉంది భారతదేశంలో. దళితులకు ఒక రాజ్యాంగం, ఇతర కులాలకు ఇంకో రాజ్యాంగం లేదు. అంబేడ్కర్ రాసిందే. భారతీయ రాజ్యాంగం. దానిపట్ల మాకు గౌరవం ఉంది. కానీ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది ఎవరు? అది మనం ఆలోచించాలి? ఈరోజు వ్యవస్థల్ని కుప్పకూల్చింది ఎవరు? రాజ్యంగ వ్యవస్థల్ని అడ్డంపెట్టుకుని అరాచకపాలన చేస్తున్నది ఎవరు? ఆత్మవిమర్శ చేసుకోవాలి?.
-- కేటీఆర్, మంత్రి
సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్... హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని డిసంబర్‌లోగా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచమే మనవైపు చూసే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ పోరాటం ఒక ఎత్తు అయితే.. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందన్నారు. ఆర్టికల్ 3 ద్వారానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.
తెలంగాణకు పూర్వం సిరిసిల్ల డివిజన్ ఉండేది. అప్పుడు ఈ వేదికల మీద ఆర్డీఓలు, డీఎస్పీలు కూర్చునే వారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమైంది కలెక్టర్, ఎస్పీలు వచ్చారు. కొత్త జిల్లాలను రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసుకున్నాం. మండలాలను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది కేవలం అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే సాధ్యమైంది. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. మంచిని మంచి అనే పరిస్థితి లేకపోవడం బాధాకరం. నేనొక్కటే కోరుతున్నా వేదికల మీద ఎన్ని ఉపన్యాసాలైనా ఇవ్వవచ్చు. కాని మంచి పనిచేసి ప్రజల మనసును గెలుపొందడమే కష్టం. - కేటీఆర్, మంత్రి
ఇవీ చూడండి: