నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... తెలంగాణ స్నేహ హస్తం ఇచ్చినా వినియోగించుకోవటం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కారు.. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీటి వాటా తేల్చాలని తెలంగాణ సైతం సుప్రీంను అడుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని జగదీశ్ రెడ్డి తెలిపారు.
సుప్రీంను ఆశ్రయించిన ఏపీ
కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల్లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన వాటాను తెలంగాణ అడ్డుకుంటోందంటూ... పిటిషన్‌లో ఆరోపించింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం చర్యలు రాజ్యాంగ విరుద్ధమని... ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలు కావడం లేదని ఆరోపించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషన్‌లో వెల్లడించింది.
ఇదీ చూడండి:
DEER: ఇంట్లోకి ప్రవేశించిన చుక్కల దుప్పి.. పట్టుకున్న అటవీ అధికారులు!