రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నది వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ జరగకుండా చూడాలన్నారు. బోట్ ఆపరేటర్లు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పర్యాటక శాఖ హోటల్స్, రిసార్ట్స్ లు, సంబంధిత ప్రదేశాల్లో నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్వహణ సరిగాలేని ప్రదేశాల్లో సంబంధిత నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టూరిజం ప్రదేశాల్లో ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని.. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
టెంపుల్ టూరిజంలో భాగంగా తిరుపతికి మాత్రమే కాకుండా వివిధ పుణ్యక్షేత్రాలకు టూరిస్ట్ ప్యాకేజీలను పెంచాలని అన్నారు. బెంగుళూర్ నుంచి గండికోట, హైదరాబాద్ నుంచి గండికోటతోపాటు ఇతర ప్రాంతాలకు టూరిస్ట్ ప్యాకేజీలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు అపార అవకాశాలు ఉన్నాయని.. వాటిని సమగ్రంగా వినియోగించుకోవాలని అన్నారు.
ఇదీ చదవండి: PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత