సోమవారం యథాతథంగా అమ్మఒడి నిధులను సీఎం జగన్ నెల్లూరులో విడుదల చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ఎస్ఈసీ రమేశ్ కుమార్...ఎన్నికల ప్రకటన విడుదల చేశారని మంత్రి ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల నియమావళికి లోబడే పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రజారోగ్యం దృష్ట్యా మాత్రమే ఎన్నికలు జరపవద్దని కోరుతున్నామని చెప్పారు. సీఎం నెల్లూరు పర్యటన సందర్భంగా మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల నియమావళికి లోబడే 'అమ్మఒడి' కార్యక్రమం ప్రారంభిస్తాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు నెల్లూరు నుంచే అమ్మఒడి కార్యక్రమం మొదలవుతుంది. గతేడాది కంటే అదనంగా 1.76 లక్షల మంది తల్లులు లబ్ధి పొందనున్నారు. - సురేశ్, విద్యాశాఖ మంత్రి
ఎస్ఈసీ వైఖరి ఏకపక్షం: మంత్రి అనిల్
శుక్రవారం అమ్మఒడి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని.. 45 లక్షల మంది తల్లులకు అమ్మఒడి నగదు ఇచ్చి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతిపక్షానికి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.
పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం: మంత్రి గౌతమ్ రెడ్డి
దివిస్ పరిశ్రమపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు. నిబంధనలు పాటిస్తేనే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతిస్తుందని తెలిపారు. 2015లోనే గత ప్రభుత్వం దివిస్‌కు అనుమతిచ్చిందన్నారు. అప్పుడు మిత్రపక్షంగా ఉన్న పవన్.. దివిస్‌కు ఎందుకు అడ్డు చెప్పలేదని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్.. ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి