Turnkey enterprises: రాష్ట్రంలో నిత్యం 40-50 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. కానీ వీటికి అధికారిక లెక్కలు ఉండటంలేదు. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ ప్రతినిధులు చూపే వివరాలనే గనులశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పారదర్శకతకు పాతరేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండరును జేపీ సంస్థ దక్కించుకొని ఒప్పందం చేసుకుంది. చెన్నైకి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ ఉపగుత్తేదారుగా వచ్చి, గతేడాది మే 14 నుంచి తవ్వకాలు, విక్రయాలు ఆరంభించింది. మరో 8 నెలల్లో ఒప్పందం ముగియనుంది. ఇప్పటికి 16 నెలలు అవుతున్నా.. ముద్రిత వేబిల్లులే ఇస్తూ సర్కారుకు తప్పుడు లెక్కలు చూపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి రేవులు, నిల్వకేంద్రాల్లో నగదునే తీసుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపులైతే పూర్తిగా లెక్కలు చూపాలనే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ వేబిల్లులూ ఇవ్వడం లేదు.
సాఫ్ట్‌వేర్ సిద్ధంచేసి.. వెనకడుగు: గనులశాఖ అనుమతించిన రేవుల్లో తవ్వే ఇసుకకు ఈ-పర్మిట్లు జారీ చేయాలి. వాహనాలకు ఆన్‌లైన్ వే-బిల్లులు ఇవ్వాలి. దీనికోసం గనులశాఖ అధికారులు కొంతకాలం క్రితం ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీనిని టర్న్‌కీ సంస్థకు ఇచ్చినప్పటికీ.. ఆమలుకాలేదు. అన్ని రేవులు, నిల్వకేంద్రాల వద్ద సెల్‌ఫోన్ సిగ్నళ్లు ఉండవని, అందువల్ల ఆన్‌లైన్ వేబిల్లుల జారీ కష్టమని గతంలో అధికారులు వాదించారు. 2019 సెప్టెంబరు నుంచి 2021 మే వరకూ ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించింది. అప్పుడు సిబ్బంది ఈపోస్ మిషన్‌లో ఆన్‌లైన్ వేబిల్లు జారీచేసేవారు. ప్రభుత్వరంగ సంస్థకు సాధ్యమైన విధానం.. ప్రైవేటు సంస్థకు ఎందుకు వీలుపడదనేది ప్రశ్నార్థకంగా ఉంది.
అధికారులు చెబుతున్నారే తప్ప: గుత్తేదారు సంస్థ త్వరలోనే ఆన్‌లైన్ వేబిల్లులు జారీ చేస్తుందని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి గత ఏడాది డిసెంబరు 21న విలేకరులకు తెలిపారు. 10-15 రోజుల్లోనే ఆన్‌లైన్ వేబిల్లులు జారీ అవుతాయని గనులశాఖ ఇన్‌ఛార్జ్ సంచాలకుల హోదాలో డబ్ల్యుబి చంద్రశేఖర్ ఈ ఏడాది మే 14న చెప్పారు. ఇలా అధికారులు ప్రకటించడమే తప్ప.. ఆన్‌లైన్ వేబిల్లుల జారీ మొదలుకాలేదు, అయ్యే అవకాశాలూ కనిపించడం లేదు.
ఇవీ చదవండి: