పుట్టిన గడ్డలో గంజి అయినా తాగి బతుకుతామంటూ కాలినడకనైనా బయలుదేరుతున్నారు వలస కూలీలు. ఇన్నాళ్లూ ఇక్కడ పనులు చేస్తూ.. సంపాదనలో ఎంతో కొంత ఇంటికి పంపుతున్న వారికి కరోనా కాటు కారణంగా పనులు కరువయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడుతున్నారు. ఎలాగైనా తమను సొంతూళ్లకు పంపించాలంటూ పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. లాఠీ దెబ్బలూ తింటున్నారు. ప్రభుత్వం పంపించకపోతే వందల కిలోమీటర్లయినా నడిచిపోతామంటూ బయలుదేరుతున్నారు. వలస కూలీలను ‘ఈనాడు’ కదిలించగా వారి ఆవేదన, ఆక్రోశం వెనక అనేక కోణాలు ఆవిష్కృతమయ్యాయి.
సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటున్న వారిలో ఒకే రకమైన ఆందోళన కనిపిస్తోంది. అప్పుడే పనులు ప్రారంభం కావని, ప్రారంభమైనా కూలి మొత్తం కూడా తక్కువ ఇస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో రూ.250 కూలీ వస్తే ఇక్కడ రూ.500 దొరుకుతున్నాయి. ఇక్కడా తక్కువే వస్తే బతికేదెలాగన్నది వారి ఆవేదన. ఎప్పుడంటే అప్పుడు స్వరాష్ట్రానికి వెళ్లే వీలులేనప్పుడు ఇక్కడ ఉండలేమంటూ మరికొందరు చెబుతున్నారు. చేతిలో పైసలన్నీ అయిపోతున్నాయని.. తినడానికి ఏమీ లేక చిన్నపిల్లలు అల్లాడుతున్నారని.. ఎవరినైనా సాయం అడుగుదామంటే తోటివారిదీ ఇదే కష్టమంటున్నారు చాలామంది.
డబ్బులన్నీ అయిపోయాయి.
హైదరాబాద్ ఆర్థిక జిల్లా చుట్టుపక్కల జీవిస్తున్న వలస కూలీల అంతర్మథనం ఇదే. ‘నేను తొలిసారి హైదరాబాద్ వచ్చా. సెంట్రింగ్ పనులు చేస్తున్నా. ఐదు నెలల్లో రూ.పది వేలు మిగిలాయి. ఏప్రిల్‌లో ఇంటికి వెళ్దామనుకున్నా. లాక్‌డౌన్‌తో ఇప్పటివరకు ఉన్న పైసలన్నీ అయిపోయాయ. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు’. ఝార్ఖండ్ నుంచి వచ్చిన బిశ్వాస్ మాట ఇది.
‘కరోనా ఎక్కువ కాలం ఉంటుందని.. రాష్ట్రాల మధ్య వాహనాలు ఉండవని అంటున్నారు. అందుకే బిహార్ నుంచి వచ్చిన మేం ఐదుగురం వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’ అని సిద్ధేంద్ర తెలిపారు. నిర్మాణ రంగం అనుబంధ వ్యవస్థలైన సిమెంటు, సెంట్రింగ్, టైల్స్, వెల్డింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇంటీరియర్ డెకరేషన్, ఐరన్, కార్పెంటరీ తదితర పరిశ్రమలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. ఆటోమొబైల్ రంగమూ స్తంభించింది. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. నగరంలోని గచ్చిబౌలి, హైటెక్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, రాయదుర్గం, నానక్‌రాంగూడ, నాచారం ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు తిరుగుప్రయాణానికి అనుమతి పత్రాల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఊరికి.. ఊపిరందక ఉక్కిరిబిక్కిరి
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలు సుమారు 70 మంది హైదరాబాద్ నుంచి ఓ సరకుల లారీలో కిక్కిరిసి సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. పోలీసులకు పట్టుబడకుండా లారీపై తాటిపత్రి కప్పడంతో పాటు.. అడ్డుగా చెక్కలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద పోలీసులు వాహనాన్ని ఆపడం వల్ల ఈ విషయం బయటపడింది. సొంతూరికి వెళ్లడానికి మరో మార్గం లేక ఇలా బయలుదేరామని వారు తెలిపారు.
ఇక అమ్మను వదలిరాను..
గచ్చిబౌలిలో కార్పెంటర్‌గా పనిచేసే ఈ యువకుడి పేరు దీపాద్రి మంగళ్. ఆదాయం నెలకు రూ. 10 వేలు. తన మిత్రులతో కలిసి ఉంటున్న గది అద్దె రూ.2 వేలు, కూడుగుడ్డకు రూ. 3,500 పోను.. ఇంటికి నెలకు రూ.3 వేలు పంపుతున్నాడు. అతడిది పశ్చిమ బంగా. అమ్మ ఒక్కతే అక్కడ ఉంటోంది. చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచింది. ఆమెను చూసి ఆరు నెలలైందని ఆవేదన చెందుతున్నాడు. ‘నా వద్ద రూ. 6 వేలు ఉండేవి. అవి అద్దెకు, ఖర్చులకు అయిపోయాయి. రైళ్లు వేస్తే ఇంటికి పోతాను. ఇక మా అమ్మను వదలిరాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.