Bullet proof vest: రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ప్రముఖుల కోసం తుపాకీ తూటాల నుంచి రక్షణ కల్పించే బనియన్ (బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్)లో కొత్త రకాన్ని అభివృద్ధి చేస్తోంది. సాధారణంగా ధరించే బనియన్‌లా కనిపించేలా.. గతంలో ఉన్నదానికంటే తేలికగా దీన్ని డిజైన్ చేశారు. తెలుపు రంగులో ఉంటుంది. అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిధానిలో ప్రదర్శన సందర్భంగా ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆలివ్ గ్రీన్ దుస్తుల రంగుల్లో మిధాని ఈ తరహా వెస్ట్‌లను తయారు చేసింది. వాటి బరువు కాస్త ఎక్కువే. కొత్త వాటిలో అధునాతన కంపోజిట్ మెటీరియల్స్ ఉపయోగించి మరింత తేలికగా అభివృద్ధి చేశారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్‌లు సైజును బట్టి 1.5, 1.79, 1.85 కిలోల బరువుతో ఉంటాయి.
నిర్దేశ ప్రమాణాలకు అనుగుణంగా..
బుల్లెట్ ప్రూఫ్ కవచాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జస్టిస్(ఎన్‌ఐజే) నిర్దేశించిన ప్రమాణాల మేరకు తయారు చేశారు. సాధారణంగా ఎన్‌ఐజీలో 2ఏ, 2, 3ఏ, 3, 4, 5 స్థాయులు ఉంటాయి. ప్రతి ఒక్కటీ బుల్లెట్‌కు సంబంధించిన విభిన్న క్యాలిబర్‌ను తట్టుకోగలుగుతాయి. ఈ వెస్ట్‌ను 3ఏ ప్రమాణాల మేరకు తయారు చేశారు.
సైన్యం కోసం జాకెట్లు సైతం..
సైన్యం కోసం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను సైతం మిధాని తయారు చేస్తోంది. ఇదివరకు 9 కిలోల బరువు ఉండేవి చేయగా.. కొత్త రకం 6.5 కిలోల బరువు ఉండేలా రూపొందించారు. 360 డిగ్రీల రక్షణ ఉండటం వీటి ప్రత్యేకత. ఏకే 47 తూటాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. తల రక్షణ కోసం మట్కానూ తయారుచేశారు.
ఇదీ చదవండి:
BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..