లక్షల రూపాయలు అప్పుచేసి అడ్రస్ లేకుండా పోవడమే కాకుండా... ఐపీ నోటీసులు ఇచ్చిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లలో జరిగింది. గ్రామానికి చెందిన చిందం గోపాల్ యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్యా ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్లోని అంబర్పేటలో నివాసముంటున్నాడు. పిల్లల ఉన్నత చదువుల కోసం ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నానంటూ స్వగ్రామంలో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు చేశాడు. ఇలా... మొత్తం 39 మంది వద్ద సుమారు రూ.54 లక్షలకు పైగా అప్పులు తీసుకున్నాడు.
ఈ క్రమంలో స్థానిక సర్పంచి దండె బోయిన మల్లేశంను సైతం నమ్మించగా... ఆయన కూడా రూ.లక్ష అప్పుగా ఇచ్చాడు. నెల రోజులుగా గోపాల్... స్వగ్రామానికి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉండడం వల్ల బాధితులకు అనుమానం కలిగింది. హైదరాబాద్కు వెళ్లి గోపాల్ ఇంటి వద్ద ఆరా తీయగా... అప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు...గోపాల్ ఉద్యోగం చేస్తున్న యాదగిరిగుట్ట డిపోలో విచారించారు. ఆయన దీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లు తెలిపిన డీఎం రఘు... తోటి ఉద్యోగుల వద్ద కూడా భారీగా అప్పులు చేసినట్లు పేర్కొన్నారు.
నమ్మి లక్షలు ఇచ్చిన వ్యక్తి కనబడకుండా పోయాడన్న బాధలో ఉన్న 39 మంది బాధితులకు... ఐపీ నోటీసులు కూడా అందాయి. డబ్బులు పోయి కోర్టు, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అప్పులిచ్చిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి