Cyber Cheating: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ హవా.. మహానగరంలో పనిఒత్తిడి, ట్రాఫిక్ ఇబ్బందులతో ఉద్యోగులు, వ్యాపారులు పూర్తిగా సాంకేతికపై ఆధారపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మొబైల్‌ఫోన్లు మొరాయించినా.. క్రెడిట్‌కార్డు సమస్య తలెత్తినా.. కస్టమర్‌కేర్ ద్వారా పరిష్కరించుకుంటున్నారు. అధికశాతం కస్టమర్‌కేర్ నెంబరును అంతర్జాలంలో వెతుకుతుంటారు. అదే సైబర్ మాయగాళ్లకు అవకాశంగా మారింది. అంతర్జాలంలో ఎవరెవరు ఏయే నెంబర్ల కోసం గాలించారనే సమాచారం సైబర్ నేరస్థులు సేకరిస్తున్నారు.
మాట్లాడుతూనే ఖాతా ఖాళీ..
Cyber Cheating with any desk: స్పూఫింగ్ ద్వారా కస్టమర్ కేర్ నెంబర్లను ఉపయోగించి బాధితులతో మాట్లాడతారు. వారికి అవసరమైన సేవలకు కొద్దిమేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ మొబైల్ నెంబర్లకు సందేశం(మెస్సేజ్) పంపుతారు. బాధితులు దాన్ని క్లిక్ చేయగానే వారు ఉపయోగించే సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ల్లో ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. బాధితులు నిర్వహించే ఆన్‌లైన్ లావాదేవీలన్నీ అటువైపు నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. నెట్‌బ్యాకింగ్ ద్వారా రూ.10-100 వరకూ పంపమంటారు. ఫోన్ ద్వారా మాట్లాడుతున్న సమయంలోనే.. బాధితుల బ్యాంకు ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి వారి ఖాతాల్లోని నగదు మొత్తం స్వాహా చేస్తారు. బాధితులు గ్రహించేలోపే కొట్టేసిన నగదును రెంటల్ యాప్ ద్వారా నగదుగా మార్చుకుంటారు.
ఈ బాధితులు ఎలా చిక్కారంటే..
- మాదాపూర్ ఐటీ సంస్థలో ఉన్నతోద్యోగి. జియో సిమ్‌కార్డు సతాయించటంతో అంతర్జాలంలో కస్టమర్ కేర్ నెంబరు కోసం వెతికాడు. కొంతసేపటికే అదే నెంబర్ నుంచి అతడికి ఫోన్‌కాల్ వచ్చింది. మీకు ఏ విధంగా సహాయపడగలంటూ అడుగుతూ.. ఫోన్‌కు మెస్సేజ్ పంపారు. దాన్ని క్లిక్ చేసి రూ.10 చెల్లించమంటూ చెప్పారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా వారు అడిగిన నగదు బదిలీ చేశాక... కొద్దిసేపటికే ఖాతాలోని రూ.20 లక్షలు మాయమయ్యాయి.
- గచ్చిబౌలికి చెందిన విద్యావంతుడు. కార్పొరేట్ సంస్థలో ఉన్నత కొలువు. బ్యాంకు డెబిట్/క్రెడిట్‌కార్డు సేవల కోసం కస్టమర్‌కేర్ నెంబరు కోసం అంతర్జాలంలో గాలించి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో వదిలేశాడు. మరుసటి రోజు అదే నెంబరు నుంచి ఫోన్‌కాల్. క్రెడిట్‌కార్డు సేవలు నిలిపివేస్తున్నామంటూ బెదిరింపు. వెంటనే కొద్దిమేర నగదు చెల్లించి పునరుద్ధరించుకునే అవకాశం ఇస్తామంటూ సలహా. పనిఒత్తిడిలో ఉన్న అతడు అటువైపు నుంచి వచ్చిన ఆదేశాలను అమలుపరిచాడు. ఏకంగా రూ.7.5లక్షలు పోగొట్టుకున్నాడు.
- కుత్బుల్లాపూర్ వ్యక్తి క్రెడిట్‌కార్డ్ రద్దు చేసుకునేందుకు కస్టమర్‌కేర్‌కు ఫోన్ చేశాడు. కొంత సమయానికే మరో నెంబరు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాము ఖాతా దారులు సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నామని లింక్ పంపారు. దాని ద్వారా వివరాలను తీసుకుంటూ బ్యాంకు ఖాతా నెంబరు, ఓటీపీ సేకరించి రూ. లక్ష కాజేశారు.
ఇలా ఎవరైనా సైబర్ మోసగాళ్లు మోసం చేస్తున్నట్టు గ్రహిస్తే.. వెంటనే డయల్ 100, టోల్‌ఫ్రీ నెంబరు 155260, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 9490617310 ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఇంటి సేవలు.. ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌నేర విభాగ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: Convocations Postpone: కొవిడ్ దృష్ట్యా.. వార్షిక స్నాతకోత్సవాలు వాయిదా వేయాలి.. గవర్నర్ ఆదేశం