జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు, 81వేల పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమ్మాల్సిన సరకు చేనేతల వద్దే ఆగిపోయిందని,నేతన్నల దగ్గరున్న స్టాక్‌ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల ప్రత్యేక కరోనా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న లోకేష్... కేవలం 80 వేలమందికి సాయం అందించి ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. లాక్డౌన్ సమయంలో మంగళగిరి చేనేత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నానన్నారు. ఇక్కడి మంగళగిరి చీర ‘భారత చేనేత బ్రాండ్'గా ఎంపికైందనీ.. అలాంటి నేతన్న కష్టాలల్లో ఉంటే.. ఉడతా సాయంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించానని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా ముందుకొచ్చి నేతన్నలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'పాలకుడికి పబ్జీపై ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాలపై లేదు'