మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేయటాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబమే తప్ప.. జగన్‌రెడ్డి లాంటి దోపిడీ కుటుంబం కాదని దుయ్యబట్టారు. సంఘం డెయిరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు ధూళిపాళ్ల కుటుంబం అండగా నిలిచిందన్నారు.
ప్రభుత్వ అసమర్ధతను, దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే.. ధూళిపాళ్లపై జగన్ రెడ్డి కక్ష కట్టారని ఆక్షేపించారు. అక్రమ కేసులు బనాయించి నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేరన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామాని స్ట్రింగ్ ఆపరేషన్‌తో బట్టబయలు చేసి, జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర వరుసగా 5 సార్లు శాసన సభ్యుడిగా గెలవడం ఒక రికార్డ్ అని అన్నారు.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధితో ..రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ధూళిపాళ్లకు ప్రత్యేక స్థానం ఉందని లోకేశ్ వెల్లడించారు.
ధూళిపాళ్ల సతీమణికి పరామర్శ:
ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయిని లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. కరోనా విజృంభిస్తుంటే.. 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి, యుద్ధ వాతావరణం సృష్టించారని జ్యోతిర్మయి ఆరోపించారు. విచారణకు సిద్ధమనీ.. అన్ని విధాలా సహకరిస్తామని తన భర్త చెప్పినా అరెస్ట్ చేశారని వాపోయారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందనీ.. ధైర్యంగా ఉండాలని జ్యోతిర్మయికి లోకేశ్ ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్