Water Pollution in langer house: హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో నాలుగు నెలలుగా కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో గాంధీనగర్ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కలుషిత నీరు రాకుండా చూడాలన్నారు. జలమండలి అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వారు ఆరోపించారు. స్థానికుల ఆందోళనతో లంగర్‌హౌస్‌కు మంచినీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు.
"నాలుగు నెలల నుంచి ఈ సమస్య ఉంది. ఈ విషయంపై ఎన్నో సార్లు జలమండలికి ఫిర్యాదు చేశాం. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వస్తున్న నీరు దేనికి వినియోగించకోకుండా ఉంది. రోజుకు రూ.1200 చెల్లించి ట్యాంకర్ నీటిని కొంటున్నాం. ఇలా ఎన్ని రోజులు కొనాలి." - స్థానికులు
కలుషిత నీరు ఘటనలపై జలమండలి ఎండీ దానకిశోర్ స్పదించారు. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సురక్షితమని అన్నారు. 70 శాతం ప్రజలు జలమండలి సరఫరా చేసే నీరు తాగుతున్నారని పేర్కొన్నారు. నీటి నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. 'సాధారణంగా రోజుకు 10వేల నమూనాలు సేకరిస్తాం. ప్రస్తుతం 25వేల నీటి నమూనాలు సేకరిస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచే అధికారులు నమూనాలు సేకరించే పనిలో ఉన్నారు' అని ఆయన తెలిపారు.
మాదాపూర్‌లో కలకలం రేపిన కలుషిత జలం ఘటనలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో నిన్నటి వరకు 57 మంది ఆసుపత్రి పాలవగా మరో 19 మంది అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కలుషిత నీటివల్లే అస్వస్థతకు గురైనట్లు కాలనీవాసులు వెల్లడించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లక్షణాలతో కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 42 మంది, చిల్డ్రన్ వార్డులో 34 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: వడ్డెర బస్తీ ఘటనలో 76కి చేరిన బాధితుల సంఖ్య