స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ తెచ్చిన ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేయటంతో ప్రభుత్వం తదుపరి కార్యచరణపై దృష్టిసారించింది. రిజర్వేషన్లను 50 శాతానికి లోబడి నిర్ణయించేందుకు ధర్మాసనం నెల రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీ రాజ్ అధికారులతో చర్చలు జరిపారు. ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి చేజారిపోకుండా మార్చిలోగా ఎన్నికలు పూర్తి చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే వరకూ ఆగకుండా ఆర్డినెన్స్ జారీ చేయాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఇవాళ ఓ నిర్ణయానికొస్తే బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం అజెండాలో ఆర్డినెన్స్ అంశాన్నీ చేర్చనున్నట్లు తెలుస్తోంది. వారం వ్యవధిలో పురపాలక ఎన్నికలు నిర్వహించే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
అధికారులు సమాయత్తం
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సోమవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ చర్చలు జరిపారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎన్నికల వ్యవహారాలు చూసే అధికారులకు రిజర్వేషన్లపై పలు సూచనలు చేశారని తెలిసింది. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన 5 నుంచి 7 రోజుల్లో 50 శాతానికి రిజర్వేషన్లను పరిమితం చేస్తూ సవరించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమాయాత్తం అవుతోంది. ప్లాన్-బి కింద చాలా జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయంగా 50 శాతానికి రిజర్వేషన్లు కుదిస్తూ నివేదికలు సిద్ధం చేశారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే కొన్ని జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది.
పదో తేదీలోగా నోటిఫికేషన్
మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పార్టీ ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. వారంలో రిజర్వేషన్ల వివరాలు అందిస్తే ఈనెల పదోతేదీలోగా నోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాకే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. 50శాతం రిజర్వేషన్లతోనే పురపాలకు, నగరపాలక సంస్థలకూ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో పట్టణ, స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 3,4 రోజుల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కుదరదు: హైకోర్టు