liquid fertilizers cost increases: పైర్లపై పిచికారీ చేసే పురుగు, తెగుళ్లు, కలుపు మందుల ధరలు తాజాగా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. నాలుగు నెలల కిందట పెరిగిన మొత్తంతో కలిపితే.. సగటున 15 నుంచి 20 శాతం వరకు చేరుకున్నాయి. దీంతో రైతుల పెట్టుబడి మరింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 3,850 టన్నుల మేర రసాయన మందులకు డిమాండు ఉంది. రూ.8వేల కోట్లకు పైనే అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. ధరల పెరుగుదల కారణంగా రైతులపై ఏటా రూ.1,200 కోట్ల అదనపు భారం పడనుంది.
ఏ మందు కొనాలన్నా రూ.500 పైమాటే..
రైతులు అధికంగా వినియోగించే అన్ని రకాల పురుగు, తెగుళ్ల మందుల ధరలు పెరిగాయి. ఏడాదిన్నర కిందట కిలో రూ.450 నుంచి రూ.500 మధ్యన లభించిన ఎసిఫేట్ ఇప్పుడు రూ.600 నుంచి రూ.700 వరకు (కంపెనీలకు అనుగుణంగా ధరలు) చేరింది. ఇమిడాక్లోప్రిడ్ ధర 11 నుంచి 12 శాతం పెరిగింది. మోనోక్రోటోఫాస్‌పైనా లీటరుకు రూ.50వరకు పెరిగింది. ఏ మందు కొనాలన్నా లీటరు రూ.500లోపు దొరకని వైనం నెలకొందని రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ ఆరంభం నాటితో పోలిస్తే లీటరుపై రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయని వివరిస్తున్నారు.
పెరుగుతున్న పెట్టుబడులు
రైతులు అధికంగా పురుగు, తెగుళ్ల మందులు చల్లే వాటిలో మిరప ఒకటి. తామర పురుగు కారణంగా ఈ ఏడాది పెద్దఎత్తున పంట దెబ్బతింది. పురుగు నివారణకు వేర్వేరు మందులు పిచికారీ చేస్తున్నారు. పెట్టుబడి పెరుగుతున్నా నివారణ సాధ్యం కావడం లేదు. గులాబీ పురుగు ఉద్ధృతితో పత్తి కూడా పోయింది. రబీలో వరికి పలు దఫాలుగా మందుల్ని పిచికారీ చేస్తారు. కంది, సెనగతోపాటు కూరగాయ పంటలు, పండ్లతోటల్లోనూ రసాయన మందుల్ని వినియోగిస్తారు. మరోవైపు కొన్ని రసాయన ఎరువుల ధరలు సైతం 50 శాతం పెరిగాయి.
చైనాలో తగ్గిన ఉత్పత్తి
పురుగు, తెగుళ్ల మందుల ధరల పెరుగుదలకు చైనాలో వీటి ఉత్పత్తిని తగ్గించడం ఒక కారణంగా చెబుతున్నారు. ఎగుమతి రాయితీని సైతం కుదించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులూ అధికమయ్యాయి. పురుగు మందుల తయారీకి వినియోగించే రసాయనాల ధరలు పెరిగాయి. జర్మనీ, జపాన్ తదితర దేశాల నుంచి ముడిసరకు దిగుమతి వ్యయం అధికమైంది. ముడిసరకు వ్యయం పెరగడం, దిగుమతులు తగ్గడంతోనే ధరలు పెరిగాయని రాష్ట్ర ఎరువులు, పురుగుమందులు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు వి.నాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: