రాష్ట్రంలో బోర్ల కింద వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రొత్సహించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. పంటల ప్రణాళికలకు ఈ ఏడాది నుంచి అంత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వివరించారు. వ్యవసాయ ఉన్నతాధికారులు, జిల్లాల జేసీలతో ఖరీఫ్‌పై సన్నద్ధ సమావేశం నిర్వహించారు. 2021 ఖరీఫ్ కోసం రాయితీపై విత్తన సరఫరా, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రుణాలు, వైఎస్సార్ పొలంబడి, వేరుశెనగ విత్తనాల పంపిణీ అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష చేశారు.
ముఖ్యమంత్రి జగన్.. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి జిల్లాకు జేసీలను నియమించారని మంత్రి కన్నబాబు వివరించారు. కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందించి, వారిని రైతు భరోసా పథకానికి అర్హులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రాప్ ప్లానింగ్, ప్రాంతాల వారీగా ఏయే పంటలకు సానుకూలత, ప్రతికూలత, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సూచించారు. రైతు దినోత్సవ ఏర్పాట్లు, ఆర్బీకేల మౌలిక సదుపాయాల కల్పన, సేవలపై మంత్రి సూచనలు చేశారు. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా.. రైతు దినోత్సవం రోజున వ్యవసాయ పనిముట్ల పంపిణీ కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్‌లను ప్రారంభిస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
ఇదీ చదవండీ... YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!