తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ నూతన భవనానికి ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్ సహకారంతో ఈ ఠాణాను నిర్మిస్తున్నారు. భూమి పూజలో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ముందుకొచ్చిన రామోజీ ఫౌండేషన్‌కు ప్రభుత్వం తరఫున మంత్రులు సబిత, ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. అత్యాధునిక పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ముందుకొచ్చిన రామోజీ ఫౌండేషన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రాచకొండ కమిషనరేట్‌కు నేటికి ఐదేళ్లు..
2015 జులై 1నే రాచకొండ కమిషనరేట్ ప్రారంభమైందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నేటికి ఐదేళ్లు గడిచిందన్నారు. ఇదే రోజున అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఠాణా 2017లోనే ప్రారంభమైందన్నారు. ప్రస్తుత భవనం కూడా రామోజీ ఫౌండేషన్ సమకూర్చిందన్న సీపీ.. నూతన భవనానికి ముందుకురావడం సంతోషకరమన్నారు. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో నూతన పీఎస్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు..
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రామోజీరావు తన సంస్థ తరఫున సుమారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ కట్టించడం హర్షించ దగ్గ విషయం. ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు సేవా కార్యక్రమాలు చాలా చేశారు. రామోజీరావు ఆరోగ్యం, వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా.
-ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
మేముసైతం..
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ అధునాతన భవనానికి రామోజీ ఫౌండేషన్ తరఫున సుమారు రూ.2 కోట్లు ఇవ్వడం పట్ల ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దినదినాభివృద్ధి చెందుతున్న నగరం కోసం మేము సైతం అని ముందుకొచ్చిన రామోజీరావుకు ధన్యవాదాలు. దేశంలోనే నంబర్ 1గా పేరొందిన తెలంగాణ పోలీసులకు అండగా నిలిచిన పెద్దలకు నమస్కారం.
- సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి