జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టిన పేదలు ఇక్కట్ల పాలవుతున్నారు. అరకొరగా సమకూర్చిన మౌలికవసతులతో లబ్ధిదారులకు వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. కొన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి నీరు సరిపడా లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులు ఉత్సవ విగ్రహాల్లా కనిపిస్తున్నాయి. వర్షాలకు అంతర్గత రహదారులు బురదమయమై నిర్మాణ సామగ్రి సరఫరా కష్టంగా మారింది. కొన్నిచోట్ల మట్టిరోడ్లు అప్పుడే కొట్టుకుపోయాయి. నీరు, విద్యుత్తు సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తుండటంతో పెనుభారం పడుతోంది. ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
ఉత్సవ విగ్రహాల్లా నీటి తొట్టెలు
ఇది కడప నగర సమీపంలోని నానాపల్లె లేఅవుట్. బోర్లు వేసి, వీధుల వెంట అడుగడుగునా నీటి తొట్టెలు నిర్మించారు. కానీ వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లబ్ధిదారులు డబ్బు పెట్టి నీళ్లు తెప్పించుకోవాల్సి వస్తోంది.
ముంపు ముప్పునకు భయపడి..
కాకినాడ నగర ప్రజలకు ఉప్పాడ కొత్తపల్లి మండలం పరిధిలోని కొమరగిరి వద్ద స్థలాలు కేటాయించారు. లేఅవుట్‌లో మెరక పనులకు రూ.కోట్లలో వెచ్చించినా, వర్షం పడితే మునిగిపోతోంది. సముద్ర తీరానికి సమీపంలోనే ఉన్నందున లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 16,601 గృహాలకుగాను 600 నిర్మాణాలు ప్రారంభించారు. చేతిపంపుల నుంచి పైపులైన్లు వేసుకునేందుకు అదనపు వ్యయం అయ్యిందని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా ప్రభుత్వం 15.60 లక్షలు ఇళ్లు నిర్మిస్తోంది. లబ్ధిదారులు సొంత స్థలాల్లో కట్టుకుంటున్న ఇళ్లు 3.50 లక్షల వరకు ఉండగా, మిగతావన్నీ కాలనీల్లో నిర్మిస్తున్నవే. అక్కడ నిర్మాణ పనులు సాగేందుకు వీలుగా తాత్కాలికంగా రహదారులు, నీరు, విద్యుత్తు, మురుగునీటి కాల్వలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. కొన్నిచోట్ల ఈ సౌకర్యాలు సమకూర్చినట్లు కాగితాల్లో ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. బోర్లు, నీటి తొట్టెలు ఉన్నా పైపులైన్లు వేయలేదు. విద్యుత్తు స్తంభాలకు కనెక్షన్లు ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాల్లో స్థలాలిచ్చి మెరక చేయకుండా వదిలేశారు. వెరసి ఇళ్ల నిర్మాణం ముందుకు కదలడం లేదు.
అరకొరగా మెరక
కోనసీమ జిల్లా అయినాపురం లేఅవుట్‌లో 98 ఇళ్లు మంజూరుకాగా 9 పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశల్లో ఉన్నాయి. కాలనీలో మెరకకు ఉపాధి హామీ పథకం కింద అరకొరగా మట్టి తోలించారు. ఇదీ నాణ్యంగా లేదు. గ్రావెల్‌తో అంతర్గత రోడ్లు వేశారు. చేతి పంపులు, విద్యుత్తు సౌకర్యం సమకూరాయి.
నీటికి కటకట!
కడప నగరంలోని చలమారెడ్డిపల్లె కాలనీలో 900 ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక్కడ బోర్లు వేసి మోటార్లు అమర్చినప్పటికీ వాటి కేబుళ్లను దుండగులు కత్తిరించుకుపోయారు. లబ్ధిదారులు ఒక్కో ట్యాంకరుకు రూ.400-500 వరకు చెల్లించి నీళ్లు కొనుక్కొంటున్నారు. రహదారులు, మురుగుకాల్వల పనులు చేపట్టలేదు.
లోతట్టులో లేఅవుట్
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఆరోగ్యనగరం లేఅవుట్‌లో 600కు పైగా ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. నీటికోసం బోర్లు తవ్వి, కనెక్షన్లు ఇచ్చినా స్థానిక వివాదాల కారణంగా అవి అందుబాటులోకి రాలేదు. లబ్ధిదారులు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. 200 లీటర్లు పట్టే నాలుగు డ్రమ్ములు రూ.350కి కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్తు సౌకర్యం కల్పించగా, మట్టి రోడ్లు వేశారు. ప్రధాన రహదారి ఎత్తుతో పోల్చితే లేఅవుట్ 5 అడుగుల లోతట్టులో ఉంది. అంతర్గత రోడ్లను బట్టి ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు చెబుతుండగా, లబ్ధిదారులు మాత్రం ప్రధాన రహదారికి అనుగుణంగా 5 అడుగుల ఎత్తులో కట్టుకుంటున్నారు.
సామగ్రి దొంగలపాలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పరిధిలోని నాగేపల్లి లేఅవుట్‌లో 1,650 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. బోర్లు, విద్యుత్తు స్తంభాలు వేసినా, కనెక్షన్లు ఇవ్వలేదు. నీళ్ల కోసమే రోజుకు రూ.500 వరకు ఖర్చవుతోందని, రాత్రిళ్లు నిర్మాణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీలు లేవు.
నిర్మాణానికి తిప్పలు
బాపట్ల పట్టణం బేతనీకాలనీ లేఅవుట్‌ను వ్యవసాయ భూముల్లో కేటాయించారు. మెరక కోసమే రూ.70 వేలు పైగా ఖర్చవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. పనులు చేసేందుకు నీరు అందుబాటులో లేదు. ప్రధాన రహదారి వెంబడి మాత్రమే కరెంటు స్తంభాలు వేశారు. అక్కడి నుంచి ఇళ్ల వద్దకు 100-200 మీటర్ల సర్వీస్ వైరు లబ్ధిదారులు కొనుగోలు చేశారు. అంతర్గత రోడ్లు వేయలేదు. డ్రైనేజీ పనులు చేస్తున్నారు. ఇక్కడ 567 గృహాలకు, 36 పూర్తయ్యాయి.
ఎత్తు పెంచేందుకు వ్యయం
శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస లేఅవుట్-2లో 1,835 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతం కావడంతో 5 అడుగుల మేర బేస్‌మెంట్ నింపడానికి మట్టికే దాదాపు రూ.లక్ష వరకు వెచ్చించామని లబ్ధిదారులు చెబుతున్నారు. ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వనందున నీటి సమస్య తీరలేదు. లేఅవుట్‌కు ఇరువైపులా వేసిన బోర్ల నుంచి నిర్మాణాల వరకు లబ్ధిదారులే పైపులు వేసుకున్నారు. ఇంత భారీ లేఅవుట్‌కు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించలేదు. విద్యుత్తు స్తంభాలు మాత్రం వేశారు.
డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకోవాల్సిందే
విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పరిధిలోని మెలిపర్తి-2 లేఅవుట్‌లో 418 ఇళ్లు కేటాయిస్తే 160 మంది ప్రారంభించారు. నీటి ట్యాంకులు అక్కడక్కడ నిర్మించినా అసంపూర్తిగా ఉన్నాయి. కనెక్షన్లు ఇవ్వలేదు. బోరు దగ్గర నుంచే పైపులు వేసుకొని డ్రమ్ముల్లో నీటిని పట్టుకుంటున్నారు. రోజువారీగా డ్రమ్ములు, పైపుల అద్దెకు అదనపు భారం పడుతోంది. మట్టి రోడ్లు అయినా లేనందున వర్షం పడితే బురదమయంగా మారుతోంది. సమీపంలోని మెలిపర్తి-1 లేఅవుట్‌లో 148 మందికి ఇళ్లు కేటాయించగా, మౌలిక వసతుల్లేక ఒక్కరు మాత్రమే పునాది వరకు నిర్మించారు.
అధికారిక లెక్కల ప్రకారం తాత్కాలికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేసిన వ్యయం
- మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లు10,500
- తాత్కాలికంగా నీరు, విద్యుత్తు సౌకర్యం కల్పనకు రూ.1,200 కోట్లు
- నేల మెరక, అంతర్గత రహదారులు, అప్రోచ్‌రోడ్లకు చేసిన ఖర్చు రూ.1,732 కోట్లు
- నీరు, విద్యుత్తు సౌకర్యం సమకూరిన లేఅవుట్లు 8 వేలు
- ఇప్పటికే ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నవి 800
- పనులు నిర్మాణంలో ఉన్నవి 1000
జగనన్న కాలనీల్లో శాశ్వత ప్రాతిపదికన సిమెంటు రహదారులు, మురుగు నీటి కాల్వలు, తాగునీటి, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకుగాను రూ.32,909 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
(జూన్ నెలాఖరు వరకు ఉన్న సమాచారం ప్రకారం)
ఇదీ చూడండి : వైకాపాకు బాధ్యత గుర్తు చేస్తున్నాం : పవన్ కల్యాణ్