హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖఈ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తున్నారు. అదే విధంగా.. కృష్ణా బోర్డు ఆధీనంలోకి తీసుకునే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ్టి భేటీలో ఉపసంఘం నివేదికపై మాత్రమే చర్చ జరగనుంది.
భేటీకి హాజరయ్యేముందు మీడియాతో మాట్లాడిన రజత్ కుమార్.. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా అడుగుతున్నామని మరోసారి స్పష్టం చేశారు. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలని.. నదీ పరివాహక ప్రాంతం ఇక్కడే ఎక్కువగా ఉందని చెప్పారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలన్న రజత్‌కుమార్.. వాటా ప్రకారం తెలంగాణకు 570 టీఎంసీలు కేటాయించాలన్నారు.