కేంద్రంలో ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా... భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్ ‘జన సంవాద్ వర్చువల్ ర్యాలీ’ సోమవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈ ర్యాలీని ఉద్దేశించి మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘ఏపీలో అహంకార, అభివృద్ధి వ్యతిరేక పాలన నడుస్తోంది. చంద్రబాబు హయాంలో అవినీతి, అసత్యాల పాలన సాగింది. ప్రస్తుతం వైకాపా పాలనలో అవినీతి వికేంద్రీకృతమైంది. మద్యం, ఇసుక మాఫియాలు పురుడు పోసుకుంటున్నాయి. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు డబ్బులన్నీ కేంద్రమే చెల్లిస్తోంది. ముఖ్యమంత్రి పదవులను దక్కించుకున్నా రాయలసీమ అభివృద్ధి చెందలేదు’ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జైపుర్ నుంచి భాజపా జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి సతీష్, దిల్లీ నుంచి సీనియర్ నేత సునీల్, ఇతర నేతలు, హైదరాబాద్ నుంచి కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధనరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ తీపి కబురు