ఫోన్... దీనికి పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు దీనిని వినియోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో చిన్నారుల చేతుల్లో స్మార్ట్ తెరలు మరింత స్మార్ట్‌గా ఒదిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు టెక్నాలజీని దున్నెస్తున్నారు అనుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యే పరిస్థితిని కోరి కొనితెచ్చుకుంటున్నారని గమనించడం లేదు. ఫలితంగా పిల్లల్లో బుద్ధి మందగించడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తోంది.
బానిసలవుతున్నారు:
యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఆన్‌లైన్ గేమ్స్ ఒక్కటేమిటీ టెంపుల్‌రన్ నుంచి మొన్న వచ్చిన పబ్‌జీ వరకు ఆటలను రయ్‌మంటూ ఆడేస్తున్నారు. గంటల తరబడి సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పదేళ్లు లేని పసిపిల్లలను పలకరించినా.. స్మార్ట్‌ఫోన్లను ఎంత స్మార్ట్‌గా వాడొచ్చో వేళ్లమీద చూపిస్తున్నారు.
సమస్యలు అధికమే!
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు.. పిల్లలను చూసుకునేందుకు ఎవరో ఒకరు ఉండేవారు. ఇప్పుడు అంతా చిన్న కుటుంబాలు. తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పడి చిన్నారులకు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చి ఆడుకోమని చెప్పే యుగం ఇది. చిన్నారులంతా స్మార్ట్ తెరలకు బానిసలవుతున్నారు. నలుగురిలో కలిసే తత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎక్కవసేపు ఆ తెరలను చూడగా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు చేతిలోని సెల్‌ఫోన్ తీసుకుంటే ఏడుపు లంకించుకుని మరీ సాధించేస్తున్నారు.
దూరంగా ఉంచండి:
పిల్లలకు వీలైనంత వరకు డిజిటల్ తెరలకు దూరంగా ఉంచడమే శ్రేయస్కరమంటున్నారు నిపుణులు. చిన్నారులకు శారీరక శ్రమ కలిగించేలా ఆటలాడించడం, నైపుణ్యాలను పెంచే విధంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా టెక్నాలజీని అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని చెబుతున్నారు.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!