స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఇవాళ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందజేయనున్నారు. ఈ వివరాల పరిశీలన అనంతరం ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మరో ప్రణాళికను కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అత్యధిక జిల్లాల్లోని పంచాయతీ, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ నివేదికలను రూపొందించారు. ఈరోజు సాయంత్రానికి 13 జిల్లాల్లోని రిజర్వేషన్లపై కసరత్తు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ... ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యులు, పురపాలక, నగర పాలక సంస్థల్లో వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపుతారు.
ఒకేసారా... విడతల వారీనా?
జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, నగరపాలక, పురపాలక సంఘాల్లో మేయర్, ఛైర్ పర్సన్ స్థానాలకు రాష్ట్రం యూనిట్‌గా సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ వివరాలను గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారులు అందజేయనున్నారు. వీటిపై సమీక్షించి శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, పురపాలక, పంచాయతీరాజ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. ఆ తర్వాత ఈనెల ఏడో తేదీన పంచాయతీ, పురపాలక ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతోపాటు పురపాలక ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించి.... రెండో విడతలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక అన్నింటినీ కలిపి ఒకేసారి ఎన్నికలను ప్రకటించి నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారా? అనే విషయమై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
ఆర్డినెన్సా... జీవోనా?
రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్సు జూరీ చేయాలని ప్రభుత్వం మొదట భావించినా న్యాయనిపుణుల సలహాపై జీవో ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్లతో జారీ చేసిన జీవో 176ను హైకోర్టు రద్దు చేసినందున... ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభమయ్యేలోగా ఆర్డినెన్సా, జివోనా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని న్యాయ వ్యవహారాలు చూసే ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం.
ఎన్నికల నిర్వహణకు సచివాలయ ఉద్యోగులు
పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ సచివాలయాల వారీగా పని చేస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో ఇవాళ జరగనున్న సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.