కరోనా వల్ల ప్రపంచమంతా స్తంభించినా వైకాపా నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. వైకాపా నేతలు అక్రమంగా మద్యం, ఇసుక, రేషన్ బియ్యం దోచుకుంటున్నారని ఆరోపించారు. భూములు కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. వైకాపా నేతలు పేదల నోటి కాడి కూడు కూడా లాగేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి సంబంధించిన ట్రస్టుకి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టు బడితే... ఇంత వరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
మద్యం ఎలుకలు తాగాయా?
వైకాపా తమ తప్పుల్ని తెదేపాపైకి నెట్టడం అలవాటైపోయిందన్న కళా... ప్రజలు నమ్మకపోయే సరికి నోరు లేని మూగ జీవాలపైకి నెడుతున్నారని దుయ్యబట్టారు. ఎలుకలు మద్యం తాగాయాని అనటం వింతగా ఉందన్న ఆయన ఇసుక అక్రమంగా దోచేస్తున్నారని ఆక్షేపించారు. ఆకలేసి ఇసుకను చేపలు తినేశాయని వైకాపా నేతలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. వైకాపా నేతల అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉంటున్నారన్నారు. మంత్రులు ప్రజాసేవ చేయటం కంటే ప్రజాధనం దోచుకోవటంలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. తమ పదవులు కాపాడుకునేందుకే తెదేపాని, చంద్రబాబుని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి : సీఎంకు లైవ్లో మాట్లాడటం రాదా?: తెదేపా