ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారే అనారోగ్యానికి గురైయ్యేవారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చిన్న వయసులోనే రోగాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్ర, పనివేళలు మారడంతో శరీరంలో సమతుల్యత లోపిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలిక జబ్బులు ప్రబలుతున్నాయి. 2000 నుంచి 2014 మధ్య అంటువ్యాధులు తగ్గి, జీవనశైలి వ్యాధుల వ్యాప్తి ఎక్కువైంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే జేబులకు చిల్లు పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 13 వేల 10, పట్టణ ప్రాంతాల్లో 30 వేల 718 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
2000 నుంచి 2014 మధ్య రాష్ట్రంలో... జీవనశైలి వ్యాధులు 29 శాతం నుంచి 59 శాతానికి చేరినట్లు వైద్య సంస్కరణ కమిటీ పరిశీలనలో తేలింది. గుండెపోటు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, రక్తపోటు, చెక్కరవ్యాధి, క్యాన్సర్ వంటి జబ్బుల బాధితులు గణనీయంగా పెరిగారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 7 శాతం మంది చక్కెరవ్యాధి, 20 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తహీనత, నెలలు నిండకుండానే పుట్టడం, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
వీటితోపాటు వచ్చే ఇతర అనారోగ్య సమస్యల్ని తగ్గించుకునేందుకు ప్రజలు అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని వైద్య రంగ సంస్కరణల కమిటీ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఆహారంగా తీసుకోవడం వల్లే జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయని సంస్కరణల కమిటీ సభ్యులు చెబుతున్నారు.
జీవనశైలి వ్యాధులు , వైద్య సేవలకు రోగులు చేస్తోన్న వ్యయం వల్ల... దేశంలో 34 శాతం మంది దారిద్య్రరేఖ కంటే దిగువకు పడిపోయారని సంస్కరణల కమిటీ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 2014లో సగటున ప్రతి కుటుంబం తన వ్యయంలో 7.3 శాతాన్ని వైద్యం కోసమే వెచ్చించినట్లు తెలిపింది. ఇది జాతీయ సగటు వ్యయం 6.8 శాతం కంటే ఎక్కువ. ఈ వ్యయంలో 10 శాతం వ్యాధి నిర్ధారణకు, 77 శాతం మందులకు ఖర్చవుతోంది.
ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచిత మందులు అందుబాటులో లేకపోవడమే అధిక వ్యయానికి కారణమని వైద్యరంగ సంస్కరణల కమిటీ తేల్చింది. ప్రభుత్వం ఉచితంగా కానీ, చౌకధరల్లో కానీ మందులు అందిస్తే... ప్రతి కుటుంబం వైద్యంపై పెట్టే ఖర్చు తగ్గుతుందని తెలిపింది.