గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో 350 విద్యుత్ బస్సులను లీజుకు తీసుకోవాలని నిర్ణయించిన ఆర్టీసీ... టెండర్లు పిలిచింది. సీఎం ఆదేశాలతో వాటిని రద్దు చేసి న్యాయసమీక్ష కమిషన్ పరిశీలనకు పంపారు. ఆన్‌లైన్ విధానంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనపై న్యాయసమీక్ష కమిషన్ అధ్యయనం చేసింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బి.శివశంకర్‌రావు ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చేసిన సిఫార్సులలో న్యాయసమీక్ష కమిషన్ పేర్కొంది.
ఇప్పుడు ఎందుకు?
ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు 45 లక్షల రూపాయల రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవటం అర్థరహితమని న్యాయసమీక్ష కమిషన్ వ్యాఖ్యానించింది. కేంద్రం ఫేమ్-2 పథకం కింద ఒక్కో బస్సుకు 55 లక్షల రూపాయల సాయం అందిస్తుండగా... రాష్ట్రం 45 లక్షల చొప్పున ఎందుకు ఇవ్వాలనుకుంటోందని న్యాయసమీక్ష కమిషన్ ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సాయాన్ని కలిపితే బస్సు తయారీదారునికి ఆర్థిక భారం తగ్గి... టెండర్లలో కిలోమీటరుకు కోట్ చేసే ధర తగ్గేంచేందుకు వీలుందని ఆర్టీసీ అధికారులు బదులిచ్చారు. 45 లక్షల రూపాయల సాయంపై ఇంకా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ బస్సులు తెస్తున్నట్లు చెబుతున్నారన్న న్యాయ సమీక్ష కమిషన్... పర్యావరణపరంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోని నగరాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పింది. ఏపీలో వాయు నాణ్యత సూచీలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రధాన నగరాల్లో భారత్ స్టాండర్డ్ 6 తరహా బస్సులను వినియోగిస్తే సమస్య రాబోదని వెల్లడించింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా జీసీసీ విధానంలో విద్యుత్ బస్సులను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు.
వచ్చే వారం టెండర్లు
ఆర్టీసీలో 11,858 బస్సులు ఉన్నాయని.. వాటిలో 2,496 అద్దె బస్సులని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏటా కాలం చెల్లిన వెయ్యి బస్సులను మార్చాల్సి ఉంటుందని...కొత్తగా తీసుకోనున్న 350 బస్సులను పాత బస్సుల స్థానంలోనే ప్రవేశపెడతామని ఆర్టీసీ అధికారులు వివరించారు. వచ్చేవారం మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు.