'జనతా కర్ఫ్యూ'... ఒక్కసారిగా ఇండియా మెుత్తం ఇంటికే పరిమితమైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎప్పుడూ లేని నిశ్శబ్దాన్ని భారతీయులకు వినిపించింది. రోజూలాగే పక్కవాళ్ల ఆరోగ్యాన్ని పాడుచేసే చర్యలు లేవు. రోడ్లపై ఉమ్మెయడాలు లేవు. చెత్తవేసేవారు... తీసే వారూ లేరు. ఇవాళ ఒక్కరోజు 'పరిశుభ్ర భారత్' దర్శనమిచ్చింది. ఎవరీ ఆరోగ్యాన్ని పాడుచేయకుండా భారతీయులంతా ఇంటికే పరిమితమయ్యారు.
ఉదయం లేవగానే మెుదలయ్యే కాలుష్య భారత్ ఇవాళ కనిపించలేదు. ఇది కాస్త ఉపశమనమే. రోజూ ఉండే వాహనాల చప్పుళ్లు వినిపించలేదు. బస్సులో వెళ్తూ ఒకరు అరటి తొక్క రోడ్డుపై వేస్తారు. బైక్‌పై వెళ్లే ఓ వ్యక్తి నోట్లో వేసుకున్న పాన్ రోడ్డుపై ఊస్తాడు. దవాఖానాలో పనిచేసే వ్యక్తి రోడ్డుపక్కనే సిరంజిలు, వాడిన కాటన్... ఇతర మెడీ వేస్ట్‌ను పడేస్తాడు. కొబ్బరి బోండాల దుకాణం నిర్వాహకుడు కాయ కొట్టి నడిరోడ్డుపై వేస్తాడు. వైన్‌షాపులో తాగి గ్లాసు, సీసాలు రోడ్డుపక్కన పడేస్తారు. ఇవన్నీ చూస్తుంటే... మనకు అపరిచితుడు సినిమాలో రాము పాత్ర గుర్తొస్తుంది కదూ. నిజమే మరీ సినిమాలో విక్రమ్ చెప్పిన ప్రతీ సంఘటన మనం నిత్యం చూసేదే కదా. శుభ్రతను పాటించుకుండా, బాధ్యత లేకుండా చేసే ఎన్నో చర్యలు అనారోగ్యానికి గురిచేసేవే మరీ.
జనతా కర్ఫ్యూతో ఇంటికే పరిమితమైన భారతీయులు రోజూ తమ వంతుగా శుభ్రతను పాటిస్తే... ఇలాంటి కరోనా వైరస్లు దరి చేరవనేది వాస్తవం. ఈ ఒక్కరోజు ప్రతీ భారతీయుడు ఓ సైనికుడిలా దేశాన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నం ప్రతీ రోజూ చేస్తే ఆరోగ్య భారతం కళ్ల ముందు దర్శనమిస్తుంది. మనల్ని మనం కాపాడుకునేందుకు కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధం. అంతా కలిసి గెలవాల్సిన తరుణం. ప్రపంచాన్ని ముంచేస్తానంటూ వస్తున్న కరోనాతో కత్తులు దూయలేం. కానీ ఈ స్పూర్తితో కరోనా లాంటి మహమ్మారి కోరలు పీకేయగలం. ఏ చెడు భారత్‌ను చేరకుండా ఉండాలన్నా... మనకున్న ఏకైక ఆయుధం స్వచ్ఛత. అది అందరి బాధ్యత.
ఇదీ చదవండి: చప్పట్లతో మార్మోగిన దేశం.. జనతా కర్ఫ్యూకు విశేష స్పందన