Jewellery stores in Andhra Pradesh: ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని చెల్లించకుండా కొందరు వ్యాపారులు అక్రమంగా బంగారం వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. అందుకోసం అధికారులంతా బృందాలుగా ఏర్పడ్డారు. విజయవాడ, నెల్లూరుతో పాటుగా రాష్ట్రంలో వివిధ చోట్ల బంగారం దుకాణాలపై దాడులు చేశారు. విజయవాడలో మనీలాండరింగ్, నకిలీ ఇన్వాయిస్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన సమాచారంతో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో చేసిన తనిఖీల్లో రూ.365 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఎంబీఎస్ జ్యుయలర్స్ షట్టర్లు మూసేసి.. ఈరోజు షాపింగ్ మాల్‌కు సెలవు అనే బోర్డు తగిలించారు . తనిఖీలపై అధికారులు నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈరోజు ఉదయం 6గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు: బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. నగరంలోని మండపాల వీధిలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది ఐటీ, కస్టమ్స్ అధికారులు బృందాలుగా విడిపోయి 15చోట్ల దాడులు చేశారు. అనధికార వ్యాపారం, జీఎస్టీ సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల దాడులతో నగరంలోని పలు బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ఇటీవల నకిలీ ఐటీ అధికారుల దాడులతో కలకలం సృష్టించడంతో ఈ సారి స్థానిక పోలీసులు బందోబస్తుగా విచ్చేశారు.
ఇవీ చదవండి: