2024 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వాహనాలు.. 2029 నాటికి ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నట్లు ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. 'వెస్ట్రన్ ఆస్ట్రేలియా టర్నింగ్ టు ఇండియా' పేరిట నిర్వహించిన సదస్సులో వర్చువల్ విధానంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రంలో మైనింగ్, వస్త్రపరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ఉత్పత్తి తదితర రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఆస్ట్రేలియా ప్రమాణాలకు తగినట్టుగా 6 నుంచి 8 నెలలపాటు శిక్షణ మెలకువలు నేర్పించి ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. 2 వేల మంది కన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్టు మంత్రి సదస్సులో వెల్లడించారు.
లిథియం బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆస్ట్రేలియన్ ప్రతినిధులను మంత్రి కోరారు. రాష్ట్రంలో... 560 కిలో మీటర్ల మేర చెన్నై-బెంగుళూరు, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని... నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నోడ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి
కిడ్నాప్ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్‌విల్ కోసమే బెదిరింపులు!