రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై అశుతోష్ మిశ్రా కమిషన్(Ashutosh Mishra Commission) నివేదిక సమర్పించి బుధవారానికి ఏడాది పూర్తయింది. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను అమలు చేయలేదు. నివేదిక ప్రభుత్వానికి అందాక అమలుకు ఇంత జాప్యం ఎప్పుడూ లేదని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటు నాటికి ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ఉన్నారు. ఆయన కాలంలో కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించలేదు. పీఆర్సీపై ప్రాథమిక చర్చలే పూర్తయ్యాయని, మంత్రివర్గానికి సిఫార్సులు చేసే అంశం కొత్త సీఎస్ చూస్తారని విశ్రాంత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. దీంతో పీఆర్సీ అమలుకు ఇంకా సానుకూల పరిస్థితులు ఏర్పడలేదని అర్థమవుతోంది. ఉద్యోగులకు 2019 జులై నుంచి 27% మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నారు. పదకొండో వేతన సవరణ సంఘం 2018 మే 28న ఏర్పాటయింది. ఆరుసార్లు గడువు పెంచాక చివరకు గతేడాది అక్టోబరు 5న కమిషన్ నివేదికను సమర్పించింది.
గతంలోనూ ఉద్యోగులకు నష్టమే
ఆంధ్రప్రదేశ్‌లో వేతన సవరణ సంఘాల ఏర్పాటు 1969లో ప్రారంభమయింది. ఇంతవరకు 11 పీఆర్సీలను ఏర్పాటు చేశారు. వీటి సిఫార్సులను ఆలస్యంగా అమలు చేయడంతో నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అమలుతేదీ, ఆర్థికలాభాల ప్రారంభానికి మధ్య కాలాన్ని నోషనల్ (వాస్తవ అమలు కాకుండా కాగితాల్లో) అని నిర్ణయిస్తున్నారు. ఈసారి అది మరీ ఆలస్యమవుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో పదవీవిరమణ చేసే ఉద్యోగులు నష్టపోతున్నారు.
ఇదీ చదవండి