దేశ సగటు ఉష్ణోగ్రతను ప్రతి 30 ఏళ్లకోసారి లెక్కిస్తారు. 1901-1930 మధ్య వార్షిక సగటు 24 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడది 25.2కు చేరింది. వందేళ్లలో 1.2 డిగ్రీలు పెరిగింది. దిల్లీ, హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ నగరాల్లో ఇది మరింత ఎక్కువ ఉండొచ్చు. ఒక డిగ్రీకిపైగా సగటు ఉష్ణోగ్రత పెరిగితేనే అనేక దుష్ఫలితాలు చూస్తున్నాం. ఇవే పరిస్థితులు కొనసాగితే ఈ విపత్తుల తీవ్రత, ప్రాణనష్టం మరింత అధికమవుతుంది. సముద్ర మట్టాలు పెరిగి భూమ్మీద చాలా ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉంటుంది.
- పర్యావరణ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎలా ఉండాలి?
పట్టణ, నగర, పారిశ్రామికీకరణలు వేగంగా జరుగుతున్నాయి. వాటి ప్రతికూల ప్రభావం పర్యావరణంపై ఉంటోంది. ఒకట్రెండు దశబ్దాలుగా బాగా ఎక్కువైంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వాటి పరిధుల్లోని అంశాలపై విధానాలను మార్చాలి. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యం కావాలి. అయితే అన్ని చర్యలూ ప్రభుత్వాలకే వదిలేయకుండా ప్రైవేటు సంస్థలు, ప్రజలు కూడా భాగం కావాలి. ప్రజల్లో ప్రభుత్వం అవగాహన పెంచాలి.
- ప్రాజెక్టులు, పర్యావరణం.. రెండింటినీ ఎలా సమతుల్యం చేయాలి?
వివిధ రకాల ప్రాజెక్టుల అవసరాలకు అటవీభూముల బదలాయింపు తగ్గించాలి. అవసరం అయినచోటే ఇవ్వాలి. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే ప్రత్యామ్నాయ భూముల్లో మొక్కలు పెద్దసంఖ్యలో నాటితే ప్రాజెక్టు పూర్తయ్యేసరికే మరోచోట అటవీప్రాంతం వృద్ధిచెందే అవకాశం ఉంటుంది.
- అభివృద్ధి... ఆర్థిక వ్యవస్థల కోణాన్ని ఎలా ఆవిష్కరిస్తారు?
తుపాన్లు, వరదలు, కరవుకాటకాలు, పిడుగుపాట్ల వంటి పలు రకాల ప్రకృతి విపత్తుల రూపంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాం. వీటి ఫలితంగా పెద్దఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం. దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు, అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అన్ని సమస్యలకు కారణమైన వాతావరణ మార్పులను కట్టడి చేయాలి. పచ్చదనం విస్తరించాలి. కర్బన ఉద్గారాలు తక్కువ విడుదల కావాలి.
- ఇటీవల పలు దేశాలు, రాష్ట్రాల్లో ఊహించని వరదలు వచ్చాయి?
వాతావరణాన్ని ప్రపంచంలో అత్యధికంగా కలుషితం చేస్తున్న దేశం చైనా. ఇప్పుడు ఆ ప్రభావాన్ని వరదల రూపంలో అది చవిచూస్తోంది. సరైన ప్రణాళికలు లేకపోవడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగానూ ఈ ప్రభావం ఉంది. వాతావరణ మార్పులతో ఏ ప్రాంతాలు ఎప్పుడు, ఎంతమేరకు ప్రభావితం అవుతున్నాయో ఆయా సందర్భాల్లో అధ్యయనం చేయాలి. దానిప్రకారం నివారణ చర్యలు చేపట్టాలి.
- కార్చిచ్చులు, వడగాడ్పుల ప్రభావం మన దేశంపై ఏ మేరకు ఉందంటారు?
కెనడా అడవులలో కార్చిచ్చు చాలారోజులుగా కొనసాగుతోంది. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో వడగాడ్పుల (హీట్‌వేవ్స్) కారణంగానే అక్కడా పరిస్థితి. మనదేశానికీ హీట్‌వేవ్స్ ముప్పు ఉంది.
- సీజన్లకు భిన్నమైన పరిస్థితుల్ని చూస్తున్నాం. వేసవిలోనూ కుండపోత వర్షాల వంటి వాటికి కారణాలేమిటి?
భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా, తీవ్రంగా మారుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. వర్షానికి, వర్షానికి మధ్య విరామం పెరుగుతోంది. వర్షం కురిసే రోజులు తగ్గుతున్నాయి. వీటన్నింటికి భూతాపమే ప్రధానకారణం. వేడి బాగా పెరిగి.. ఆ మేరకు నీరు ఎక్కువగా ఆవిరై భారీగా మేఘాలు ఏర్పడుతున్నాయి. కుండపోత వర్షాలు, వారంలో, నెలలో పడాల్సిన వర్షం ఒకేరోజులో పడడం.. ఇలాంటివన్నీ భూతాపం వల్లే.
- ఉష్ణోగ్రతలు పెరగడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?
బొగ్గు, విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వాడకం విపరీతంగా పెరిగింది. దాని ఫలితమే వరదలు, వడగాడ్పులు, కరవు, కొన్నిచోట్ల తుపాన్ వంటి విపత్తులు. 2015 నుంచి 2020 వరకు దేశంలోని అటవీప్రాంతాల్లో కార్చిచ్చులు రెట్టింపు అయ్యాయి. వాతావరణ మార్పులతో పాటు అటవీభూముల నిర్వహణ సరిగా లేకపోవడం కారణాలు. అడవులను నరికేస్తూ తగలబెడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నుంచి ఉపశమనం కోసం ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీలు వాడుతున్నాం. వీటికోసం పెద్దఎత్తున విద్యుత్తును ఉపయోగిస్తున్నాం. ఇదీ ఉష్ణోగ్రతల హెచ్చుకు ఓ హేతువే. వేడి నుంచి తట్టుకోవడానికి ఏసీలు వాడుతూ తిరిగి భూతాపాన్ని మరింత పెంచుతున్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషచక్రాన్ని విచ్ఛిన్నం చేయాలి. నగరాల అభివృద్ధి ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణ డిజైన్లు మారాలి. అవి పర్యావరణ అనుకూలంగా ఉండాలి. సహజసిద్ధమైన గాలి, వెలుతురు, పచ్చటి పరిసరాలకు ప్రాధాన్యమివ్వాలి. నగరాల్లో వాతావరణాన్ని చల్లబరిచే ప్రణాళికలు ఉండాలి.
- వనరుల వినియోగానికి, భూతాపానికీ కూడా సంబంధం ఉందా?
నీరు, విద్యుత్తు, భూమి వినియోగం పెరుగుతోంది. వ్యర్థాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. వనరుల్ని ఎక్కువగా వాడటం కూడా కొన్నేళ్లుగా వాతావరణంలో అనూహ్య మార్పులకు కారణమవుతోంది. రానున్న మూడు, నాలుగు దశబ్దాల్లో బొగ్గు, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. తద్వారా వాటిద్వారా వచ్చే ఉద్గారాలు తగ్గుతాయి. వనరుల వినియోగానికి సరైన ప్రణాళిక ఉండాలి.
ఇదీ చదవండి : భారత యువత భవిష్యత్తు భద్రం