వివిధ జిల్లాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. విభిన్న ప్రతిభావంతుల్లో స్ఫూర్తి నింపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకోవాలని సూచించారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణాజిల్లా నందిగామలోని భవిత డే కేర్ సెంటర్లో.. విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పించారు. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో అధికారులు.. దివ్యాంగులకు రాయితీపై బస్ పాస్‌లను అందజేశారు.
పిల్లల్లోని మానసిక, శారీరక లోపాలను చిన్నతనంలోనే తల్లిదండ్రులు గుర్తించి.. అందుకు అనుగుణంగా చికిత్స అందించాలని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంబాబు నాయక్ సూచించారు. దివ్యాంగ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ.. వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండాలని ఎంఈవో బాలాజీ నాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వం వారికి కల్పించే అనేక రాయితీలను వినియోగించుకోవాలని కోరారు.
కడప జిల్లాలో...
దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6,000 పింఛన్ ఇవ్వాలని.. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. దివ్యాంగులకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించాలని చిన్న సుబ్బయ్య కోరారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంతో పాటు యానాంలోనూ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు కాదని.. మనోధైర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన గొప్పవారూ ఉన్నారని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించగా.. బహుమతి ప్రదాన కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఎస్పీ భక్తవత్సలం, ప్రాంతీయ విద్యాశాఖ అధికారి సాయినాథ్‌లు పాల్గొన్నారు. ముమ్మిడివరంలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు.. విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాలు, బట్టలు బహుకరించారు.
ఇదీ చదవండి: